బీమా.. ఏమంటారో! | - | Sakshi
Sakshi News home page

బీమా.. ఏమంటారో!

Oct 11 2025 5:54 AM | Updated on Oct 11 2025 5:54 AM

బీమా.

బీమా.. ఏమంటారో!

రాయవరం ఘటనలో

బాధితులకు కానరాని భరోసా

ఇప్పటికీ పరిహారం ప్రకటించని

కూటమి సర్కారు

కార్మికులకు బీమా చేయించని

బాణసంచా తయారీ యజమానులు

సాక్షి, అమలాపురం: బాణసంచా వెలుగులు చూసి ఆనందిస్తాం.. పిల్లా పాపలతో సందడి చేస్తాం.. అలాంటి మందుగుండు సామగ్రి తయారీ ప్రాణాలతో చెలగాటమని అందరికీ తెలిసిందే.. అయినా తమ కుటుంబాల కోసం ప్రాణాలను పణంగా పెట్టి బాణసంచా తయారీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, రోజు వారీ కూలీలు ఎందరో.. వారు చిన్న నిప్పు రేగినా క్షణాల్లో అశువులు బాస్తున్నారు. అలాంటి సందర్భాల్లో బాధిత కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది.. సరిగ్గా అలానే రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలోని పెను విస్ఫోటనంలో మృత్యువాత పడిన ఎనిమిది మంది కుటుంబ సభ్యుల పరిస్థితి ఉంది. అలాగే తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఇద్దరూ అతి పేద కుటుంబాలకు చెందిన వారే. వీరికి కనీసం బీమా సౌకర్యం లేక, ప్రభుత్వం పరిహారం ఇవ్వక పెద్ద కష్టం వచ్చి పడింది.

రాయవరంలో శ్రీగణపతి గ్రాండ్‌ ఫైర్‌ వర్క్స్‌ బాణసంచా దుకాణంలో బుధవారం జరిగిన పేలుడులో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలై మృత్యువుతో పోరాడుతున్నారు. వాస్తవంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్రకటించాలి. ఇంత వరకూ ఏ ప్రకటనా రాలేదు. ఇటువంటి ప్రమాదాల్లో మరణించిన కార్మికులు, కూలీలకు కనీసం బీమా పరిహారమైనా వస్తోంది. వీరికి బీమా కూడా లేకపోవడంతో ఆ పరిహారం వచ్చే పరిస్థితి లేదు. వీరికే కాదు.. గతంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతి చెందిన చాలా మందికి బీమా లేక బాధిత కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. అయితే 2019 అక్టోబర్‌లో పెద్దాపురం నియోజకవర్గం పరిధి సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా దుకాణం పేలుడులో మృతి చెందిన వారికి నాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో భారీ పరిహారం అందింది. మొత్తం ఆరుగురు మృతి చెందగా, ఒక్కొక్కరికీ వివిధ రూపాల్లో రూ.15 లక్షల వరకూ పరిహారం వచ్చింది. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప 2014లో జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, రూ.మూడు లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. అది కూడా నాడు ప్రతిపక్ష నేత హోదాలో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేయడంతో నాటి చంద్రబాబు ప్రభుత్వం తప్పదన్నట్టు పరిహారం ఇచ్చింది. అయితే చిన్న ప్రమాదాల్లో మృతి చెందిన వారికి మాత్రం పరిహారం అందడం లేదు. ముఖ్యంగా బీమా లేకపోవడమే కారణం. బీమా చేయించకపోవడానికి యాజమాన్యం, కార్మికుల అశ్రద్ధతోపాటు కార్మిక శాఖ తీరు కూడా కారణమవుతోంది.

కారణాలు ఎన్నో..

● రాయవరం ప్రమాదంలో చనిపోయిన ఎనిమిది మందికి బీమా లేదు. ఈ తయారీ కేంద్రంలో పనిచేస్తున్న ఎనిమిది మందికి బీమా చేయించారని అధికారులు చెబుతున్నారు. అయితే చనిపోయిన వారికి మాత్రం బీమా లేదు. దీనితో వీరందకీ ప్రభుత్వం ఇచ్చే అరకొర పరిహారం, లేదా తయారీదారులు ఇచ్చే సాయమే దిక్కు. ఈ ప్రమాదంలో యజమాని సత్యనారాయణ మూర్తి కూడా మృతి చెందడంతో యాజమాన్యం నుంచి పరిహారం అందుతుందీ లేనిదీ చెప్పలేని పరిస్థితి.

● బాణసంచా తయారీ కేంద్రాల్లో తాత్కాలికంగా పనిచేస్తున్న కూలీలకు బీమా ఉండడం లేదు. వారికి బీమా చేయిస్తున్నదీ లేనిది చూడాల్సిన కార్మిక శాఖ పట్టించుకోవడం లేదు. తమకు ఇచ్చే కార్మికుల జాబితా కన్నా అధికంగా కూలీలను వినియోగిస్తున్నారని వారు చెబుతున్నారు. నిరంతరం నిఘా పెట్టేందుకు కార్మిక శాఖకు సిబ్బంది కొరత వేధిస్తుంది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు బీమా లేకుంటే యజమానుల నుంచి రికవరీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

● బీమా కల్పించడం కోసం కార్మికునిగా పేరు నమోదు చేయిస్తే అతను ఆ కంపెనీ, పరిశ్రమలో పనిచేసే ఉద్యోగిగా గుర్తించాల్సి వస్తోంది. అప్పుడు పని లేని సమయాల్లో కూడా జీతాలు ఇవ్వడం, ఇతర పీఎస్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలి. అందుకే కార్మికులకు బీమా కల్పించడం లేదని తెలుస్తోంది.

● కార్మిక శాఖకు సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. కోనసీమ జిల్లా పరిధిలో సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, అటెండర్లు కూడా లేకుండా కార్యకలాపాలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల పరిశ్రమలు, బాణసంచా తయారీ కేంద్రాలపై నిఘా పెట్టే పరిస్థితి లేకుండా పోయింది.

ముందుగా డిపాజిట్‌ చేయించుకోవాలి

బాణసంచా తయారీ కేంద్రాల్లోనే కాదు.. పరిశ్రమలు, కంపెనీల్లో పనిచేసే కార్మికులకు బీమా చేయించకుంటే యాజమాన్యాల నుంచి నష్ట పరిహారం వసూలు చేస్తామని కార్మిక శాఖ చెబుతోంది. పేలుడు, అగ్నికి ఆహుతి కావడం వంటి ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యాలు కూడా నష్టపోతున్నాయి. రాయవరం ప్రమాదంలో యజమాని కూడా మృతి చెందడంతోపాటు బాణసంచా తయా రీ కేంద్రం బూడిదైంది. అటువంటప్పుడు వారి నుంచి పరిహారం రికవరీ ఎలా చేస్తారనే దానికి అధికారుల వద్ద సమాధానం లేదు. అందుకే ప్రమాదా లు జరిగే అవకాశమున్న సంస్థలు, వ్యాపార కేంద్రాలు, యాజమాన్యాల వద్ద నుంచి కార్మిక శాఖ ముందుగా కొంత మొత్తం డిపాజిట్‌ చేయించుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

కార్మికుల నమోదు జరగక..

రాయవరంలో బాణసంచా పేలుడు ఘటన మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగితే రాత్రి ఏడు గంటల వరకూ అక్కడకక్కడే చనిపోయిన ఆరో వ్యక్తిని గుర్తించలేకపోయారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులు, రోజువారీ కూలీల వివరాలను నమోదు చేయడం లేదు. తయారీ కేంద్రాలు, పరిశ్రమల వద్ద కనీసం బోర్డులు ఏర్పాటు చేసి రోజూ పనికి వస్తున్న వారి వివరాలు నమోదు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు.

బీమా.. ఏమంటారో!1
1/1

బీమా.. ఏమంటారో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement