
ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలి
అమలాపురం రూరల్: ఖరీఫ్ ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో బుధవారం సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, పౌరసరఫరాల అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు సన్నద్ధత, తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 4.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా రానుందని, స్థానిక అవసరాలకు పోగా మిగిలిన 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 85 లక్షల గోనె సంచులు సిద్ధం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 151 రైస్‌మిల్లులు ఉన్నాయని, వీటి కెపాసిటీ ఆధారంగా లక్ష్యాలు నిర్దేశిస్తామన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ.ఉదయభాస్కర్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ పి.శ్రీనివాసరావు, ఎఫ్‌సీఐ రీజినల్ మేనేజర్ గంగాధర్ పాల్గొన్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడో దశ భూముల రీ సర్వే నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని జేసీ నిషాంతి రెవెన్యూ, సర్వే సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో కొత్తపేట, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో సమీక్ష జరిపారు. మూడో దశ రీసర్వే కార్యకలాపాలు ఈ నెల 3న ప్రారంభమయ్యాయని, రైతులు సద్వినియోగం చేసుకుని భావితరాలకు వివాద రహిత భూములను అందించాలని సూచించారు. ఆర్డీఓలు దేవరకొండ అఖిల, పి.శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.
బోధనేతర పనుల
బహిష్కరణ
అమలాపురం టౌన్: బోధనేతర పనుల్లో భాగంగా ప్రధానంగా వివిధ రకాల సమాచారాన్ని సేకరించే యాప్‌లను శుక్రవారం నుంచి బహిష్కరించినట్లు ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎంటీవీ సుబ్బారావు స్పష్టం చేశారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు చేపట్టిన ఈ బహిష్కరణ సమాచారాన్ని జిల్లా కలెక్టర్, డీఈఓకు తెలిసేలా ఆ రెండు కార్యాలయాల్లో ఫ్యాప్టో జిల్లా ప్రతినిధులు వినతి పత్రాలు అందించారు. కలెక్టరేట్‌లో ఈఓ కె.విశ్వేశ్వరరావుకు, డీఈఓ డాక్టర్ షేక్ సలీమ్ బాషాలకు వేర్వేరుగా వినతి పత్రాలు ఇచ్చారు. ఇక నుంచి ఉపాధ్యాయులుగా తరగతి గదుల్లో అటెండెన్స్, విద్యా బోధన, మిడ్ డే మీల్స్ వంటి కార్యక్రమాలనే పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి దొరబాబు, కో చైర్మన్ సరిదే సత్య పల్లంరాజు, పెంకే సత్యనారాయణ, షబ్బీర్ హుస్సేన్, నాగిరెడ్డి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలి