
విజ్ఞాపన మహాసభను విజయవంతం చేయండి
అమలాపురం టౌన్: ఏపీ డీఎస్సీ – 98 మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులు విజయవాడలో ధర్నాచౌక్ వద్ద శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే విజ్ఞాపన మహా ధర్నాకు జిల్లా నుంచి ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు సీహెచ్ కేశవకుమార్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 4,072 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఈ విజ్ఞాపన మహా సభలో పాల్గొనున్నారని అన్నారు. తమకు చెందిన ఐదు ప్రధాన డిమాండ్ల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న తాత్సారానికి నిరసనగా సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులను వెంటనే రెగ్యులర్ చేయాలనేది తమ ప్రధాన డిమాండ్ అని గుర్తు చేశారు. వీరికి 55 ఏళ్లు పైబడి ఉండడంతో రిటైర్డ్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నెలకు రూ.25 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విజ్ఞాపన మహాసభకు రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర ప్రతినిధులను, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను ఆహ్వానించామన్నారు. ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్, ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయిప్రసాద్‌ను ఆయన ఇంటికి ఎంటీఎస్ ఉపాధ్యాయులు బృందంగా వెళ్లి ఆహ్వానించామని కేశవకుమార్ తెలిపారు.
డిసెంబర్ 3న రిలయన్స్
క్విజ్ పోటీలు
అమలాపురం రూరల్: విద్యార్థినీ విద్యార్థుల్లో ప్రతిభను ప్రదర్శించేందుకు రిలయన్స్ ధీరూబాయ్ అంబానీ క్విజ్ పోటీలు చక్కని వేదికగా నిలుస్తాయని రిలయన్స్ సీఎస్‌ఆర్ హెడ్ పి.సుబ్రహ్మణ్యం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఈ క్విజ్‌లు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 3న అమలాపురం అంబేడ్కర్ భవన్ వద్ద ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8, 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు పోటీలు ఉంటాయన్నారు. నవంబర్ 30 లోగా కాకినాడలోని తమ కార్యాలయ పనిదినాల్లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 0884 3577222, 63022 23156 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.