
బాణసంచా కేంద్రాలపై దాడులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అక్రమ బాణసంచా నిల్వలు, తయారీ కేంద్రాలపై జిల్లా పోలీసులు గురువారం మెరుపు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ డి.నరసింహకిశోర్ తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బొమ్మూరు, రాజానగరం, బిక్కవోలు, కడియం, చాగల్లు, సమిశ్రగూడెం, సీతానగరం, గోకవరం, నల్లజర్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో బాణసంచా తయారీ కేంద్రాలు, గోడౌన్‌లపై కేసులు నమోదు చేశారు. బాణసంచా లైసెన్సు కల్గిన వారు మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధలనకు లోబడి బాణసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలని ఎస్పీ డి.నరసింహాకిశోర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా జన సంచార స్థలాల్లోను, అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన, విక్రయాలు జరిపిన అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు ఈ తనిఖీలు కొనసాగించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా రహస్యంగా మందుగుండు సామగ్రి తయారు చేస్తున్నట్లు, నిల్వ ఉంచినట్లు తెలిస్తే డయల్ 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.