విజయదుర్గా పీఠం పీఠాధిపతి గాడ్
రాయవరం: సరస్వతీ కటాక్షం ఉంటే విజయం తథ్యమని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) అన్నారు. పీఠానికి వచ్చిన భక్తులనుద్దేశించి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగిస్తూ.. జ్ఞానప్రదాయినిగా ఉన్న సరస్వతీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. జ్ఞాన సంపన్నులుగా మెలగాలంటే మంచి వాక్‌శుద్ది లభించాలన్నారు. అమ్మవారి దయకు పాత్రులు కావాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పీఠం కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులు పీఠంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. పీఠంలో విజయదుర్గమ్మ వారిని సరస్వతీమాత అవతారంలో అలంకరించారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్వో వేణుగోపాల్, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కరనారాయణ, సత్యవెంకట కామేశ్వరి, పెదపాటి సత్యకనకదుర్గ, బలిజేపల్లి రమా తదితరుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
సరస్వతీదేవికి పూజలు
చిన్నారులకు విద్యాబుద్ధులు కలగాలని ఆకాంక్షిస్తూ విజయదుర్గా పీఠంలో సరస్వతీ పూజలు నిర్వహించారు. చీమలకొండ వీరావధాని, శివ, చక్రవర్తుల మాధవాచార్యులు, గండికోట సూర్యనారాయణ అర్చకత్వంలో చిన్నారులు సరస్వతీ అష్టోత్తర సహస్రనామాలతో సామూహిక సరస్వతీ పూజలు చేశారు. అనంతరం విద్యార్థులకు సరస్వతీదేవి ప్రతిమను, రక్షాబంధనాన్ని ప్రసాదంగా అందజేశారు.
సరస్వతీ కటాక్షంతో విజయం తథ్యం