ఐరావతం.. చూసొద్దాం | - | Sakshi
Sakshi News home page

ఐరావతం.. చూసొద్దాం

Sep 30 2025 8:01 AM | Updated on Sep 30 2025 8:01 AM

ఐరావత

ఐరావతం.. చూసొద్దాం

గొల్లపాలెంలో ఏనుగుల సంబరం ప్రసిద్ధి

దసరా రోజున భారీ ఊరేగింపు

పోటీపోటీగా ఉత్సవాల నిర్వహణ

కాజులూరు: దసరా.. ప్రతి పల్లెకూ ఓ విశిష్టతే. అందరికీ ప్రత్యేకతే. అచ్చం అలానే కాజులూరు నియోజకవర్గం గొల్లపాలెంలో ఏనుగుల సంబరం ప్రఖ్యాతి గాంచింది. ఏటా విజయ దశమిని పురస్కరించుకుని ఇక్కడ ఏనుగుల సంబరాలు నిర్వహించడం అనాదిగా వస్తోంది. సాధారణంగా ప్రతి గ్రామంలో శరన్నవరాత్ర ఉత్సవాల్లో దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తుంటారు. అయితే గొల్లపాలెంలో పాత మార్కెట్‌ సెంటర్‌ వద్ద రామాలయం సమీపంలో మాత్రం శరన్నవరాత్ర రోజుల్లో భేతాళునికి పూజలు నిర్వహించడం విశేషం. చివరి రోజు దసరా పండగ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ గ్రామ వీధుల్లో చిన్న ఏనుగు ప్రతిమను, రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ట్రాక్టరుపై పెద్ద ఏనుగు ప్రతిమను ఊరేగిస్తుంటారు. సుమారు రెండు వందల ఏళ్ల నుంచి ప్రతి ఏటా ఈ సంబరం నిర్వహిస్తుండడం విశేషం. ఐరావతాన్ని తలపించేలా తెల్లని వస్త్రం, ఎండు గడ్డితో తయారు చేసిన ఏనుగు ప్రతిమలకు పెద్ద, పెద్ద చావిళ్లు నిర్మించి ఏడాది పొడవునా స్థానికులు వాటిని పరిరక్షిస్తుంటారు. విజయ దశమికి 10 రోజుల ముందు ఏనుగు ప్రతిమలను బయటకు తీసి శుభ్రం చేసి మెరుగులు దిద్ది ప్రత్యేక పూజలు చేసి సంబరం చేస్తారు. ఈ గ్రామంలోని వెలమ కులస్తుల ఆధ్వర్యంలో చిన్న ఏనుగు సంబరం, కాపు, బలిజ కులస్తుల సారథ్యంలో పెద్ద ఏనుగు సంబరం చేస్తుంటారు. చిన్న ఏనుగును ఎడ్లబండి మాదిరి బండిపై ఉంచి భక్తులు జేజేలు పలుకుతూ తోసుకుంటూ ముందుకు సాగుతారు. పెద్ద ఏనుగునైతే ట్రాక్టర్‌పై ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు. ఎండు గడ్డి, తెల్లని వస్త్రం, తదితర వస్తువులతో తయారు చేసిన భారీ ఏనుగుల ప్రతిమలను ఊరేగించే సమయంలో వేలాది మంది ముందుకు సాగుతుంటారు. భేతాళుని రూపంలో భక్తులు ఏనుగుల ప్రతిమలకు పూజలు చేస్తుంటారు. గరగ నృత్యాలు, కోయ డ్యాన్సులు, గారడీ, బ్యాండ్‌ మేళాలతో ఈ ఊరేగింపు కోలహలంగా సాగుతోంది. ఇరువర్గాల వారూ పోటీపోటీగా సంబరం నిర్వహిస్తుండడం ఇక్కడ ప్రత్యేకత. గతంలో ఈ సంబరాల్లో ఘర్షణలు జరిగేవి. పెద్దలు సఖ్యత కుదిర్చడంతో ఇటీవల ప్రశాంతంగా జరుగుతున్నాయి. పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఉత్సవాలను తిలకిస్తుంటారు. అలాగే బాణసంచా కాల్పులకు ప్రత్యేకత ఉంది. రాత్రి మిరిమిట్లు గొలుపేలా ఇక్కడ సంబరాలు నిర్వహిస్తున్నారు.

అనాదిగా వస్తున్న ఆచారం

గొల్లపాలెంలో ఏనుగుల సంబరం అనాదిగా వస్తుంది. గ్రామంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. జీవనోపాధి నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారు సైతం ఈ పండగకు తిరిగి గ్రామానికి రావడం జరుగుతోంది.

–టేకుమూడి దుర్గారావు,

స్థానికుడు

సంప్రదాయాలను కొనసాగిస్తూ..

ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కాస్త తీరిక దొరికితే సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతుంటారు. పండగలు, సంబరాలను మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలో మన ఆచారాలను తెలిపేలా పురాతన సంప్రదాయాలు కొనసాగిస్తూ నేటికీ ఏనుగుల సంబరాలు నిర్వహించడం అభినందనీయం.

–జొన్నకూటి వెంకటేశ్వరరావు,

ఎంపీటీసీ మాజీ సభ్యుడు

ఐరావతం.. చూసొద్దాం1
1/3

ఐరావతం.. చూసొద్దాం

ఐరావతం.. చూసొద్దాం2
2/3

ఐరావతం.. చూసొద్దాం

ఐరావతం.. చూసొద్దాం3
3/3

ఐరావతం.. చూసొద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement