
రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్ల పెన్ డౌ
అమలాపురం టౌన్: ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన లోప భూయిష్టమైన 2.0 విధానం వల్ల ప్రజలకు, దస్తావేజు లేఖర్లకు విపరీమైన అసౌకర్యం, ఇబ్బంది కలుగుతోందని దస్తావేజు లేఖర్లు ఆందోళన బాట పడుతున్నారు. ఈనెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు పెన్‌డౌన్ చేసి ఆందోళనకు దిగుతున్నారు. అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని దస్తావేజు లేఖర్లు మంగళవారం సమావేశమై ఈ ఆందోళనపై చర్చించారు. ఈ విధానంలో ఓటీపీలు బహిర్గతం చేసేందుకు ప్రజలు సంకోచిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఆటో మ్యుటేషన్ సిస్టమ్‌ను తాము స్వాగతిస్తున్నా డిపార్ట్‌మెంట్‌లో సమన్వయ లోపం వల్ల చాలా ఇబ్బందులు అనివార్యమవుతున్నాయని దస్తావేజు లేఖర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లోపాలను సరిదిద్దాలని వారు డిమాండు చేశారు. ఈ రెండు రోజుల్లో తాము పెన్‌డౌన్ చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశం తీర్మానించింది. ఈ రెండు రోజుల్లో అమలాపురం దస్తావేజు లేఖర్లు తమ (డీడబ్ల్యూఎస్)లను మూసివేసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొవాలని సమావేశం పిలుపునిచ్చింది. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్‌కు తమ డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వనున్నట్లు దస్తావేజు లేఖర్లు తెలిపారు. సమావేశంలో అమలాపురం దస్తావేజు లేఖర్ల సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సంఘం గౌరవాధ్యక్షుడిగా గుంటు ఫణిప్రసాద్, అధ్యక్షుడిగా జిన్నూరి సురేష్, ఉపాధ్యక్షుడిగా వెణుతురుపల్లి సుబ్బు, కార్యదర్శిగా పందిరి హరి, కోశాధికారిగా గుమ్మళ్ల నరేష్, సంయుక్త కార్యదర్శిగా దుర్గేష్ ఎన్నికయ్యారు. ఎన్నికై న నూతన కార్యవర్గాన్ని సంఘ ప్రతినిఽధి మట్టపర్తి రాము తదితరులు అభినందించారు.
19, 20 తేదీల్లో ఆందోళనకు సిద్ధం