
కొత్త సార్లొస్తున్నారు..
ఫ 15న ఎంపిక జాబితా విడుదలయ్యే
అవకాశం
ఫ 22 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
ఫ దసరా సెలవుల తర్వాత విధుల్లోకి..
రాయవరం: డీఎస్సీ–2025 తుది అంకానికి చేరుకుంది. ఈ పరీక్షలో పొందిన మార్కులు, రిజర్వేషన్ తదితర ప్రామాణికాల ఆధారంగా అర్హత పొందిన వారిని గుర్తించి, కాల్ లెటర్లు పంపించారు. ఆ అభ్యర్థులకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,241 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో తుది జాబితా రూపొందించినట్లు సమాచారం. ఈ జాబితాను జిల్లా కమిటీ ఆమోదం కోసం పంపించాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రోస్టర్, మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా సెలక్షన్ కమిటీ ఆమోద ముద్ర వేసిన అనంతరం ఎంపిక జాబితాను ఈ నెల 15 సాయంత్రానికి రాష్ట్ర అధికారులు ప్రకటించే అవకాశముంది.
కొలువుల్లో చేరేవారికి శిక్షణ
కొత్తగా చేరనున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎంపిక కానున్న 1,241 మంది ఉపాధ్యాయులకు ఈ నెల 22 నుంచి 29 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. పీజీటీలు, టీజీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఎస్జీటీ క్యాడర్‌లో ఎంపిక కానున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెసిడెన్షియల్ విధానంలో ఇచ్చే శిక్షణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనువైన విద్యా సంస్థలను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. కొత్త ఉపాధ్యాయులు దసరా సెలవుల అనంతరం విధుల్లో చేరే అవకాశముంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీలివే..
కేటగిరీ ప్రభుత్వ/ జెడ్పీ/
మున్సిపల్ మేనేజ్‌మెంట్
ఎస్జీటీ 423
ఎస్‌ఏ తెలుగు 65
ఎస్‌ఏ హిందీ 78
ఎస్‌ఏ ఇంగ్లిష్ 95
ఎస్‌ఏ గణితం 64
ఎస్‌ఏ పీఎస్ 71
ఎస్‌ఏ బయాలజీ 103
ఎస్‌ఏ సోషల్ 132
ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 210