
మహిళలపై అత్యాచారాలు అరికట్టాలి
అమలాపురం టౌన్: మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, గృహ హింసలు అధికమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా బాధ్యురాలు డి.ఆదిలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టి మహిళలు, బాలికలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో అమలాపురం డివిజన్ ఐద్వా ముఖ్య బాధ్యుల సమావేశాన్ని ఐద్వా ప్రతినిధి ఆర్.సుశీల అధ్యక్షతన నిర్వహించారు. నేడు మహిళలు, బాలికలు, విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. నేటి యువత గంజాయి, మద్యం వంటి వాటికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆదిలక్ష్మి అన్నారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలు, యువత మాదక ద్రవ్యాల బారిన పడి తప్పుతోవ పడుతున్న పరిణామాలపై ప్రభుత్వం స్పందించి అదుపునకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఐద్వా ప్రతినిధులు జి.దైవకృప, కె.బేబీ గంగారత్నం, బి.ఎస్తేరురాణి, పి.అమూల్య, సుబ్బలక్ష్మి, హైమావతి, మణిమాల, మరియమ్మ, పూర్ణిమ, తులసీగౌరి, విజయలక్ష్మి, ఉమా సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.