
అన్నం పెట్టిన ఇంటికే ద్రోహం
● కాకినాడ చోరీ కేసులో పనిమనిషి అరెస్టు
● వివరాలు వెల్లడించిన సీఐ
కాకినాడ క్రైం: కాకినాడలో జరిగిన చోరీ కేసులో పనిమనిషే దొంగ అని తేలింది. అన్నం పెట్టిన ఇంటికే ఆమె ద్రోహం చేసింది. సీఐ నాగ దుర్గారావు తెలిపిన వివరాల మేరకు.. బాలాజీ చెరువు జంక్షన్ సమీపంలోని కొమ్మిరెడ్డివారి వీధిలో నివాసముంటున్న బత్తుల కనకదుర్గ ఇంట్లో కొద్ది రోజులుగా వనమాడి జగదాంబ అనే మహిళ పనిచేస్తోంది. ఈ నెల 2వ తేదీన యజమాని ఇంటి నుంచి 277 గ్రాముల బంగారం, రూ.లక్ష దొంగిలించింది. ఈ విషయాన్ని గుర్తించిన కనకదుర్గ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వన్ టౌన్ పోలీసులతో పాటు క్రైం సీఐ కృష్ణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా పనిమనిషి నిర్వాకం బయటపడింది. దీంతో జగదాంబను పోలీసులు గురువారం మధ్యాహ్నం జగన్నాథపురం మరిడమ్మపేటలోని ఆమె ఇంటి వద్ద అరెస్టు చేశారు. ఆమె నుంచి 183 గ్రాముల బంగారంతో పాటు రూ.లక్ష మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.