
చమురు సంస్థలపై చర్యలు తీసుకోని కూటమి
అమలాపురం టౌన్: ఏ రాష్ట్రంలో తమ అన్వేషణ, కార్యకలాపాలకు భూములను తవ్వుతారో ఆ ప్రాంతానికి చమురు సంస్థలు రాయల్టీ చెల్లించాలని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు గుర్తు చేశారు. కానీ ఆ దిశగా కూటమి ప్రభుత్వం చమురు సంస్థలపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తోందన్నారు. ఈ మేరకు గురువారం అమలాపురంలో ప్రకటన విడుదల చేశారు. అంబానీ, ఆదానీలకు వ్యతిరేకంగా చమురు సంస్థలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. దీని వల్లే జిల్లాలో ఓఎన్జీసీ వ్యతిరేక పోరాట సమితి చేస్తున్న పోరాటాలను కొంతకాలంగా చమురు సంస్థలు పట్టించుకోవడం లేదన్నారు. కేజీ బేసిన్‌లో ఓఎన్జీసీ, రిలయన్స్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (వేదాంత) తదితర చమురు సంస్థలు విచ్చలవిడిగా ఆయిల్ నిక్షేపాల కోసం తవ్వేయడం వల్ల ఈ ప్రాంత భూములు కుంగి పోతూ, నిస్సారమవుతున్నాయని గుర్తు చేశారు. ఇటీవల కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో జిల్లా ప్రజాప్రతినిధులు.. ఓఎన్జీసీ అధికారులపై ధ్వజమెత్తడం, మీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పడం స్వాగతించే విషయమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అటు ప్రభుత్వం, ఇటు చమురు సంస్థలు ముందుకు రావడం లేదన్నారు.
ఎంపీ మిథున్‌రెడ్డికి స్వాగతం
సాక్షి, రాజమహేంద్రవరం: లిక్కర్ అక్రమ కేసులో మధ్యంతర బెయిల్‌పై తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డికి కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు స్వాగతం పలికారు. వారిలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరి, జ్యోతుల చంటిబాబు, పి.గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జి జి.శ్రీనివాసరావు ఉన్నారు. అనంతరం ఎంపీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
మెడికల్ కాలేజీల పేరిట
కూటమి దందా
అల్లవరం: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ కూటమి ప్రభుత్వం దందాకు పాల్పడుతోందని మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి, వాటిలో కొన్నింటిని నిర్మాణం చేశారన్నారు. సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. తమ ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రమే సంపదను సృష్టించే పనిలో ఉందన్నారు. చంద్రబాబు అండ్ కో ప్రభుత్వ భూములను విచ్చిన్నం చేసి ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. ఖజానాలో డబ్బు లేదని మెడికల్ కాలేజీలను నిర్వహించలేమని డ్రామాలాడుతున్న చంద్రబాబు.. తన బినామీలకు ఒక్కో మెడికల్ కాలేజీని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 14 నెలల కాలంలో రూ.2 లక్షల కోట్లు అప్పులు చేసిన ఆయన.. మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు కేటాయించకపోవడం చాలా దారుణమన్నారు. ఇది ముమ్మాటికి పేద వైద్య విద్యార్థులను మోసం చేయడమేనన్నారు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని మూడు సార్లు పరిపాలించిన చంద్రబాబు తన పాలనతో ఒక్కటైనా మెడికల్ కాలేజీ అయినా నిర్మించారా అని ప్రశ్నించారు.
వినాయకునికి
వెండి పళ్లెం సమర్పణ
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామికి విశాఖపట్నం తగరపు వలసకు చెందిన కటకం అవినాష్, సాహిత్య శృతి దంపతులు గురువారం వెండి పళ్లెం సమర్పించారు. 1050 గ్రాములు బరువైన ఈ పళ్లెం విలువ రూ.1,35,000 ఉంటుంది. దాతలు దీన్ని ఆలయ అర్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తికి అందజేశారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు, వేద పండితులు సత్కరించి, స్వామివారి శేష వస్త్రాలు, చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

చమురు సంస్థలపై చర్యలు తీసుకోని కూటమి

చమురు సంస్థలపై చర్యలు తీసుకోని కూటమి