
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
● అధికారులకు నేడు వినతులు అందిస్తాం
● ఆంధ్ర ఆటోవాలా జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు
అమలాపురం టౌన్: ఎన్నికల సమయంలో తమకు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శుక్రవారం కలెక్టర్, మండలాల తహసీల్దార్లకు ఆటో యూనియన్ల సభ్యులు వినతి పత్రాలు అందించాలని ఆంధ్ర ఆటోవాలా యూనియన్ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు పిలుపునిచ్చారు. అమలాపురంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు చెప్పినట్టు ఆటో డైవర్లకు ఏటా రూ.15 వేలు చొప్పున.. రెండేళ్లకుగాను వాహన మిత్ర పథకం కింద రూ.30 వేలు జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 50 ఏళ్లు దాటిన ఆటో డ్రైవర్లకు ప్రతి నెలా పింఛన్ అందించాలని, ఆటోలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆంధ్రా ఆటో వాలా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊటాల వెంకటేష్, కోశాధికారి మోకా శ్రీను, డివిజన్ అధ్యక్షుడు బొలిశెట్టి వంకర్, ప్రధాన కార్యదర్శి బొక్కా నాని, కోశాధికారి బొమ్మి ఫణి తదితరులు పాల్గొన్నారు.
ఆటోల బంద్ తాత్కాలికంగా వాయిదా
కూటమి ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.15 వేలు ఇస్తానని ప్రకటించిన కారణంగా జిల్లాలో శుక్ర, శనివారాల్లో తలపెట్టిన ఆటోల బంద్, సామూహిక నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సత్తిరాజు ప్రకటించారు. జిల్లాలోని ఆటో డ్రైవర్లు వాయిదా విషయాన్ని గమనించాలన్నారు.