
ట్రంప్ సుంకాలతో ఆక్వా అతలాకుతలం
అమలాపురం టౌన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలతో మన రాష్ట్రంలోని ఆక్వా రంగం అతలాకుతలం అవుతోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించేందుకు ఈ నెల 11న విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆక్వా రైతు సదస్సుకు జిల్లా నుంచి ఆక్వా రైతులు హాజరు కావాలని కోరారు. స్థానిక ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో మంగళవారం రైతు, కౌలు రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలు, కేవీపీఎస్, సీఐటీయూ నాయకులు ఈ విషయంపై సమావేశమయ్యారు. అనంతరం విజయవాడ ఆక్వా రైతు సదస్సుకు హాజరుకావాలంటూ పట్టణ, పరిసర ప్రాంతాల్లోని ఆక్వా రైతులను స్వయంగా కలసి మాట్లాడారు. కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ తదితరులు ఆక్వా రైతులను సదస్సుకు ఆహ్వానించారు. మోదీ ప్రభుత్వం తక్షణమే ఈ సుంకాల విధింపుపై స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
12, 13 తేదీల్లో ఆటోల బంద్
అమలాపురం టౌన్: సీ్త్ర శక్తి పథకం పేరుతో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంలో ఆటోలకు గిరాకీ లేకుండా పోయింది. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు కలుగుతుండడంతో జిల్లాలోని ఆటో డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా తమ జేబులకు నల్ల బ్యాడ్జీలు, ఆటోలకు నల్ల జెండాలు కట్టి నిరసన తెలుపుతున్నారు. అలాగే ఈ నెల 12, 13వ తేదీల్లో ఆటోలను పూర్తిగా నిలిపివేసి బంద్ పాటించనున్నారు. ఆ రెండు రోజులూ 24 గంటల పాటు సామూహిక నిరాహర దీక్షలు చేపడతారు. ఆంధ్ర ఆటోవాలా జిల్లా శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 వేల ఆటోలు ఉన్నాయి.
మెప్మా కార్యకలాపాలపై సమీక్ష
అమలాపురం టౌన్: జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అమలు చేస్తున్న కార్యకలాపాలపై స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని మెప్మా కార్యాలయంలో ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) డి.పెంచలయ్య మంగళవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ అన్ని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో డ్వాక్రా సంఘాల సభ్యులకు అందేలా మెప్మా సిబ్బంది కృషి చేయాలన్నారు. వాణిజ్య బ్యాంకుల్లో తీసుకునే రుణాలు, లైవ్లీ హుడ్ యూనిట్ల రికవరీపై చర్చించారు. సమావేశంలో ఐబీ మోహన్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, నాలుగు మున్సిపాలిటీల సీఎంఎంలు , సీవోలు, డీఈవోలు, డీఆర్‌పీలు పాల్గొన్నారు.
11 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
అమలాపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా రేషన్ డిపోల వద్ద ఈ నెల 11 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 22 మండలాలకు సుమారు 5,31,926 కార్డులు వచ్చాయని, వాటిని సంబంధిత తహసీల్దార్లకు అప్పగించామన్నారు. రేషన్ డీలర్లు, సచివాలయ ఉద్యోగుల సమన్వయంతో ఈ నెల 11 నుంచి సంబంధిత మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధుల సమక్షంలో డిపోలకు పంపిణీ చేస్తారన్నారు. తదుపరి రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులకు అందజేస్తారన్నారు.
అరుణాచలంకు ప్రత్యేక బస్సు
రాజమహేంద్రవరం సిటీ: అరుణాచలం, రామేశ్వరం యాత్రకు రాజమహేంద్రవరం డిపో నుంచి మంగళవారం స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు 30 మంది భక్తులతో బయలుదేరి వెళ్లిందని డిపో మేనేజర్ మాధవ్ తెలిపారు. ఈ యాత్రలో 9 రోజులపాటు కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, పళని, కోయంబత్తూర్, కుంభకోణం, చిదంబరం, గురువాయూర్, త్రివేండ్రం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, తంజావూరు వంటి 14 పుణ్యక్షేత్రాలు దర్శించుకొని తిరిగి 18వ తేదీ రాజమహేంద్రవరం డిపోకు చేరుకుంటుందన్నారు.

ట్రంప్ సుంకాలతో ఆక్వా అతలాకుతలం