
గాలికుంటు.. తరిమికొట్టు
● 15 నుంచి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం
● జిల్లాకు చేరుకున్న 1.25 లక్షల డోసులు
● వర్షాకాలంలో వ్యాధి తీవ్రత ఎక్కువ
రాయవరం: గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు దున్నాలన్నా, దుక్కి చేయాలన్నా ఎద్దులు, దున్నల అవసరం తప్పనిసరి. వీటితో పాటు పాడి పశువులు బాగుంటేనే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. అయితే ఎద్దులు, దున్నలు, ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) సోకే ప్రమాదం ఉంది. వైరస్ కారణంగా వచ్చే ఈ వ్యాధి ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. దీని బారిన పడిన పశువుల్లో ఉత్పాదకత తగ్గిపోతుంది. తద్వారా పశు పోషకులకు తీవ్రమైన ఆర్థిక నష్టం కలుగుతుంది. అయితే సరైన చికిత్సా విధానాలు పాటిస్తే పశువులు, జీవాలను ఈ వ్యాధి బారి నుంచి కాపాడుకోవచ్చని పశువైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకూ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనున్నారు.
వ్యాధి లక్షణాలు
● గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు గాలికుంటు వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన సమయంలో పశువుల్లో గర్భం విఫలమవుతుంది. వేడిని తట్టుకోలేవు.
● ఈ వ్యాధికి గురైన గేదె, మేక, గొర్రె వంటి జీవాల్లో తీవ్రమైన జ్వరం కనిపిస్తుంది. పాల దిగుబడి తగ్గడం, నోరు, మూతి, కాళ్లు, పొదుగు మీద పుండ్లు, బొబ్బలు కనపడటం, కాళ్లు కుంటడం, నోటి నుంచి విపరీతంగా నురగ కారడం వంటి లక్షణాలు ఉంటే గాలికుంటు వ్యాధి సోకినట్టు గుర్తించాలి.
● ఆగస్టు, సెప్టెంబర్, మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. దీని వల్ల మరణాల శాతం తక్కువైనప్పటికీ పశువుల్లో ఉత్పాదక శక్తి సామర్థ్యం తగ్గుతుంది. జ్వరం తీవ్రత 104 నుంచి 106 డిగ్రీల ఫారన్ హీట్ వరకు పెరిగిన పశువులు నీరసిస్తాయి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది.
● నోటి ఎపిథీలియం (పైపొర), పళ్లు, చిగుళ్లు, నాలుక, ముట్టి లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడతాయి. అవి 24 గంటల్లో చితికి పోవడం వల్ల పశువులు నొప్పితో మేత తినవు. నోటి నుంచి చొంగ కారుతుంది.
● చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. పొదుగుపై బొబ్బలు ఏర్పడి ఒక్కొక్కసారి పొదుగువాపు సంభవిస్తుంది. పశువులు శ్వాసను కష్టంగా పీల్చుతూ, రొప్పుతూ ఎండవేడిమికి తట్టుకోలేక నీరసిస్తాయి.
వ్యాప్తి చెందే విధానం
నోరు, కాలు వ్యాధికి గురైన పశువుల అంతస్రావాల (లాలాజలం, పుండ్ల నుంచి కారే రసి) వల్ల మిగతా పశువులకు వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వ్యాధికారక క్రిమి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సంకరజాతి పశువులు త్వరగా ఈ వ్యాధి బారిన పడతాయి.
జిల్లాలో పరిస్థితి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,65,368 పశువులు ఉన్నాయి. వీటికి 7వ రౌండ్ బూస్టర్ డోస్ ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకూ ఉచితంగా వేయనున్నారు. అక్టోబర్ 15 నుంచి నెలాఖరు వరకు ఏడాది లోపు దూడలకు బూస్టర్ డోస్ వేస్తారు. జిల్లాకు 1.65 లక్షల డోసులు అవసరం కాగా, 1.25లక్షల డోసులు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. గతంలో 40 వేల డోసుల నిల్వలు ఉన్నాయి.
నివారణ ఇలా..
పశువులు బాగా బలహీనంగా ఉంటే గ్లూకోజ్ రక్తంలోకి ఇవ్వాల్సి ఉంటుంది. నోటిలో పుండ్లు వలన మేత మేయవు కనుక వాటికి సులభంగా జీర్ణమయ్యే పోషక పదార్థాలతో కూడిన ఆహారం అందించాలి. జావ, జొన్న, అన్నం, బెల్లంతో కలిపి ప్రతిరోజూ తాగించడం ద్వారా బలహీన పడకుండా జాగ్రత్త వహించాలి. ఈ వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి. వాటి మలమూత్రాలను గడ్డిలో కాల్చివేయాలి. చనిపోయిన పశువులను సున్నపు గోతిలో పూడ్చాలి. ఆబోతులు, దున్నల వీర్యం ద్వారా కూడా వ్యాధి వ్యాపిస్తుంది. అందువల్ల వ్యాధి సోకిన వాటిని సుమారు మూడు నెలల వరకు సంపర్కానికి వినియోగించకూడదు. కాలిగిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాలతో కడిగి నీమ్‌లెంట్, వేపనూనె పూయాలి. నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్ చల్లి గ్లిజరిన్ కలిపి రాయాలి. వైద్యుడిని సంప్రదించి అవసరమైన మందులు వాడాలి.

గాలికుంటు.. తరిమికొట్టు