
విద్యుత్ షాక్‌తో సెంట్రింగ్ కూలీ మృతి
కపిలేశ్వరపురం: మండలంలోని టేకి గ్రామానికి చెందిన సెంట్రింగ్ కూలి వాసంశెట్టి శ్రీనివాస్ (30) పని ప్రదేశంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. శ్రీనివాస్ మరో ఇద్దరు కూలీలతో కలిసి మంగళవారం పడమర ఖండ్రిక గ్రామంలో ఇంటి శ్లాబ్ సెంట్రింగ్ పనికి వెళ్లాడు. శ్రీనివాస్ ఆ భవనం కింది నుంచి ఊసను పైకి లాగుతుండగా 11 కేవీ వైర్లకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వి.శ్రీనివాస్, జి.శివకృష్ణలకు స్వల్పగాయాలయ్యాయి. ఇద్దరినీ తొలుత కపిలేశ్వరపురం సీహెచ్‌సీకి, తర్వాత రాజమహేంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అంగర ఎస్సై జి.హరీష్‌కుమార్ తెలిపారు.
వ్యాన్ కింద పడి..
ముమ్మిడివరం: ఠానేల్లంక ప్రధాన రహదారిపై రాజుపాలెం వద్ద మంగళవారం కొబ్బరి డొక్కల లోడుతో వెళుతున్న వ్యాన్ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. కూనాలంకకు చెందిన కొప్పిశెట్టి గంగరాజు (45) మోటారు సైకిల్‌పై ముమ్మిడివరం వెళుతున్నాడు. రాజుపాలెం వద్ద ముమ్మిడివరం వైపు వెళుతున్న వ్యాన్‌ను తప్పించబోయి దాని కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంగరాజుకు భార్య రాజేశ్వరి, ఒక కుమార్తె ఉన్నారు. ఎస్సై డి.జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేటు బస్సు ఢీకొని..
గండేపల్లి: మల్లేపల్లికి చెందిన మడపాటి సూరిబాబు (34) తాళ్లూరు సమీపంలోని సామిల్లు వద్ద తాపీపనికి వెళ్లాడు. అక్కడ రోడ్డు పక్కన నిలుచున్న అతడిని విజయవాడ వైపు నుంచి విశాఖ వైపు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూరిబాబు అక్కడిక్కడే మృతి చెందాడు. అతడికి భార్య రామలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గండేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.