
రాజమహేంద్రవరం – కాకినాడ మధ్య స్పెషల్ రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం – కాకినాడ పోర్టు మధ్య ప్రతి రోజు అన్ రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అఽధికారులు మంగళవారం ప్రకటించారు. కాకినాడ పోర్టు – రాజమహేంద్రవరం (07523) రైలు ఈ నెల 15 నుంచి, రాజమహేంద్రవరం – కాకినాడ పోర్టు (07524) రైలు ఈ నెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. ఇవి రాజమహేంద్రవరం, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, మేడపాడు, సామర్లకోట, కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లలో ఆగుతాయని వివరించారు. ఒక రైలు రాజమహేంద్రవరంలో తెల్లవారుజాము మూడు గంటలకు బయలుదేరి 4.40 గంటలకు కాకినాడ పోర్టు చేరుకుంటుందన్నారు. మరో రైలు కాకినాడలో ఉదయం 6.15 గంటలకు బయలుదేరి 8.15 గంటలకు రాజమహేంద్రవరం వస్తుందన్నారు.
పింక్ మూన్‌తో
‘నన్నయ’ ఒప్పందం
రాజానగరం: పింక్ మూన్ టెక్నాలజీ సంస్థతో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. దీనికి సంబంధించిన పత్రాలపై మంగళవారం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, టెక్నాలజీ సంస్థ సీఈఓ టి.నాగమల్లేశ్వరరావు సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా యూనివర్సిటీలోని అన్ని ఐటీ, సాఫ్ట్‌వేర్ ప్రక్రియలకు సాంకేతిక మద్దతు, కన్సల్టెన్సీ, పరిష్కారాలు అందిస్తుందన్నారు.
రూ.1.15 లక్షల ఎరువుల సీజ్
అంబాజీపేట: నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ ఉంచిన రూ.1.15 లక్షల విలువైన 5.20 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాజమహేంద్రవరం డీఎస్పీ ఎస్.తాతారావు, మండల వ్యవసాయ అధికారి కె.ధర్మప్రసాద్ తెలిపారు. మాచవరంలోని సుభూషణ్ ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని రాజమహేంద్రవరానికి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగ అధికారులతో కలిసి మండల వ్యవసాయ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూ.1,15,370 విలువైన ఎరువులను సీజ్ చేశారు. తనిఖీలో డీసీటీవో ఎ.నవీన్ కుమార్, కానిస్టేబుల్ శివకుమార్, ఏఈఓ జాజెబ్ శాస్త్రి పాల్గొన్నారు.