
అప్పనపల్లిలో దర్శనాలు పునః ప్రారంభం
మామిడికుదురు: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం మూసివేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం గోదావరి జలాలతో ఆలయాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ కార్యక్రమాలు, నిత్య కై ంకర్యాల అనంతరం భక్తుల దర్శనాలు పునః ప్రారంభించారు. స్వామివారి సన్నిధిలో నిత్యం నిర్వహించే శ్రీలక్ష్మీ నారాయణ హోమం జరిపారు. స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఈ ఏర్పాట్లను ఆలయ ఈఓ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు.
అర్జీలకు నాణ్యమైన
పరిష్కారం చూపండి
అమలాపురం రూరల్: ప్రజా సమస్యలపై వస్తున్న అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 200 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పునరావృతమైతే జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ప్రజల పెట్టుకున్న నమ్మకానికి మరింత బలం చేకూర్చేలా అధికారుల పనితీరు ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి మాట్లాడుతూ నిర్ణీత సమయంలో అర్జీలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.మాధవి, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, ఎస్‌డీసీ పి.కృష్ణమూర్తి, డీఎల్‌డీఓ రాజేశ్వరరావు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 23 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 23 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందించారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటుంబ, ఆస్తి వివాదాలకు సంబంధించినవే ఉండడంతో ఎస్పీ కృష్ణారావు వారితో ముఖాముఖి చర్చించి పరిష్కారానికి సూచనలు చేశారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను ఎస్పీ ఆదేశించారు.
నేడు 5కే మారథాన్
అమలాపురం రూరల్: జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై యువతలో అవగాహన పెంచేందుకు 5కే మారథాన్ రన్‌ను మంగళవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో టీషర్ట్‌లను ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా స్థాయి మారథాన్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ 5కే రన్‌ను భట్నవిల్లి జంక్షన్ నుంచి రోళ్లపాలెం వరకూ ఉదయం ఆరు గంటల నుంచి 7 గంటల మధ్య జరుపుతామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాల నుంచి 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు పాల్గొనాలని ఆయన సూచించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. మొదటి విజేతకు రూ.10 వేలు, రెండో స్థానానికి రూ.7 వేలు ఇస్తామని, మహిళలు, పురుషులకు వేర్వేరుగా 5కే రన్ ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ ఎ.బుజ్జిబాబును 90003 97803 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు.

అప్పనపల్లిలో దర్శనాలు పునః ప్రారంభం

అప్పనపల్లిలో దర్శనాలు పునః ప్రారంభం