
ఆటో కార్మికుల పొట్టకొట్టిన కూటమి ప్రభుత్వం
ఆర్డీఓ కార్యాలయం ఎదుట డ్రైవర్ల ధర్నా
అమలాపురం టౌన్: సీ్త్రశక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తెచ్చిన కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్టకొట్టిందని ఆంధ్రా ఆటోవాలా జిల్లా శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు దుయ్యబట్టారు. సీ్త్రశక్తి పథకాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆటో కార్మికులు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆటో కార్మికులను నడిరోడ్డుపై పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసనలు ఉధృతం చేసేందుకు రూపొందించిన కార్యాచరణలో భాగంగా ఈ నెల 12, 13 తేదీల్లో జిల్లాలోని ఆటోలన్నీ బంద్ చేసి సామూహిక నిరాహార నిరసన దీక్షలు చేపట్టనున్నామని అన్నారు. జిల్లాలోని ఆటో కార్మికులు స్వచ్ఛందంగా చేస్తున్న ఈ నిరసన ద్వారా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ నెల 18, 19 తేదీల్లో ఆటో యూనియన్ల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి సీ్త్రశక్తి పథకం వల్ల ఆటో కార్మికులకు ఉపాధిపరంగా జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని సత్తిరాజు తెలిపారు. ఆంధ్ర ఆటోవాలా జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఊటాల వెంకటేష్, ఆటో యూనియన్ల ప్రతినిధులు రాయుడు ప్రసాద్, బొలిశెట్టి శంకర్, బొక్కా నాని, బొమ్మి ఫణి తదితరులు పాల్గొన్నారు.
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో..
అమలాపురం రూరల్: మహిళలకు ఉచిత బస్సు పఽథకం వల్ల ఆటో, క్యాబ్, టాటా ఏస్ కార్మికులు ఉపాధి కోల్పోయారని ట్రాన్స్‌పోర్ట్ రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్, వైఎస్ ఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యల్లమల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానంగా ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేదని మండిపడ్డారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆటోలను కొనుగోలు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. అలాంటి కార్మికులను ప్రభుత్వం కుంగదీయడం సరికాదన్నారు. కార్యక్రమంలో గుత్తుల మల్లిబాబు, బొంతు శ్రీనివాసరావు, యల్లమల్లి చంటి, గుత్తుల సుబ్రహ్మణ్యం, మద్దా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆటో కార్మికుల పొట్టకొట్టిన కూటమి ప్రభుత్వం