
తక్షణమే గౌరవ వేతనాలు అందించండి
అమలాపురం రూరల్: జిల్లాలోని మసీదుల ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతన బకాయిలను తక్షణం విడుదల చేయాలని అమలాపురం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ మైనారిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 11 నెలలుగా గౌరవ వేతనాలు చెల్లించడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్‌లకు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు మైనారిటీలకు మసీదు మెయింటెనెన్స్ నిమిత్తం ప్రతి నెలా రూ.5 వేలు, షాదీతోఫా కింద రూ.లక్ష ఇస్తామని హామీలు ఇచ్చి, మైనారిటీల ఓట్లు దండుకుని కనీసం మసీదు పెద్ద, చిన్న గురువులకు గౌరవ వేతనం కూడా వేయలేని పరిస్థితి తెచ్చారన్నారు. కార్యక్రమంలో రాజోలు, అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ వై.షరీఫ్, షేక్ ఖాజాబాబు, అన్వర్ తాహిర్ హుస్సేన్, మీర్జా ఆదం బేగ్, అమలాపురం టౌన్ మైనారిటీ సెల్ కార్యదర్శి హుస్సేన్, ఎండీ జుబేర్, ఎండీ నౌషాద్, ఎండీ యూసుబ్ తదితరులు పాల్గొన్నారు.
తెరచుకున్న సత్యదేవుని
ఆలయ ద్వారాలు
అన్నవరం: చంద్ర గ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం మూత పడిన సత్యదేవుని ఆలయాన్ని సోమవారం ఉదయం తెరిచి సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. స్వామివారి వ్రతాలు, నిత్యకల్యాణం, ఆయుష్య హోమం, సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ, పంచహారతుల సేవ, రాత్రి పవళింపుసేవ యథావిధిగా నిర్వహించారు. సుమారు మూడు వేల మంది భక్తులు మాత్రమే స్వామివారి ఆలయానికి విచ్చేశారు. స్వామివారి వ్రతాలు మూడు వందలు జరిగాయి.