బస్తామే సవాల్‌ | - | Sakshi
Sakshi News home page

బస్తామే సవాల్‌

Sep 9 2025 1:33 PM | Updated on Sep 9 2025 1:33 PM

బస్తా

బస్తామే సవాల్‌

బ్లాక్‌ మార్కెట్‌లోకి యూరియా

బస్తా రూ.330 నుంచి

రూ.390 వరకూ అమ్మకాలు

సహకార సంఘాల వద్ద కొని

విక్రయిస్తున్న ఏజెన్సీలు

దోపిడీ చేస్తున్నా పట్టించుకోని ‘కూటమి’

నేడు వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’

సాక్షి, అమలాపురం: కష్టాలు తీర్చరు.. ముందుకు ‘సాగు’నివ్వరు.. గోదావరి డెల్టాలో ఖరీఫ్‌ పంటకు రైతులు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నా కనీసం చూడరు.. ఇదీ కూటమి ప్రభుత్వంలో తీరు.. తొలుత పెట్టుబడులకు సొమ్ము అందక, తర్వాత ప్రకృతి సహకరించక అష్టకష్టాలు పడిన రైతులు కీలక సమయంలో యూరియా బస్తాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వరి, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు తదితర పంటలు సాగుచేసే రైతులే కాదు కొబ్బరి, అరటి, పోక, కోకో, కంద, పువ్వులు వంటి ఉద్యాన పంటలు వేసిన కర్షకులు యూరియా దొరకక అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఏ మండలంలో ఏ ఆయకట్టులో రైతును కదిపినా కొందామంటే ఒక్క యూరియా బస్తా కూడా లేదని ఘొల్లుమంటున్నారు.

జిల్లాలో యూరియా కొరత ప్రస్తుతం కొంత వరకూ తగ్గింది. వారం పది రోజుల కిందట రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు పడ్డారు. ఇతర జిల్లాల్లో యూరియా కొరతను బూచిగా చూపించి ఇక్కడ ప్రైవేట్‌ ఎరువుల దుకాణ యజమానులు యూరియాను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా 45 కిలోల బస్తాను రూ.266.70కు విక్రయించాల్సి ఉంది. కానీ ప్రైవేట్‌ దుకాణదారులు రూ.330 నుంచి రూ.390కు అమ్ముతున్నారు. ఆర్‌ఎస్‌కే, పీఏసీఎస్‌ల వద్ద యూరియా అమ్మకాలకు ఆధార్‌ లింక్‌ చేయడం, ఎకరాకు అర బస్తా మాత్రమే ఇస్తామనే నిబంధనలతో రైతులకు పూర్తి స్థాయిలో యూరియాను అందుబాటులో ఉంచడం లేదు. ఒక విధంగా ఇది కృత్రిమ కొరత సృష్టించడమే. జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. అలాగే 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి, మరో 50 వేల ఎకరాల్లో అరటి, కంద, కోకో, పోక, కూరగాయ, ఇతర వాణిజ్య పంటలు సాగవుతున్నాయి. ఈ సీజన్‌లో అంటే జూన్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 16,812 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా గత నెల ఐదో తేదీ వరకూ 17,364 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నారు. ఈ నాలుగు రోజుల్లో మరింత యూరియా అందుబాటులోకి వచ్చిందని వివరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసిన దానికన్నా యూరియా వినియోగం ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ఎక్కువ ధరకు ప్రైవేట్‌ వ్యాపారులు యూరియాను అమ్ముకున్నారు. మరికొంత మంది హోల్‌సేల్‌ డీలర్లు యూరియా కావాలంటే గుళికలు, లేదా జింక్‌ కొనాలని పట్టుబడుతున్నారు. యూరియా దిగుమతి చేయకపోవడానికి ఇదో కారణమని డీలర్లు చెబుతున్నారు.

వచ్చిందే తడవుగా..

● ఉప్పలగుప్తం మండలంలో వారం పది రోజుల తర్వాత ఆర్‌ఎస్‌కేలకు 20 మెట్రిక్‌ టన్నులు, సహకార సంఘాలకు 20 మెట్రిక్‌ టన్నులు, ప్రైవేట్‌ డీలర్లకు 90 మెట్రిక్‌ టన్నుల చొప్పున తాజాగా వచ్చింది. దీంతో ఏఓ కార్యాలయం వద్ద స్లిప్‌లు కోసం రైతులు ఎగబడుతున్నారు. కొబ్బరి రైతులకు పంపిణీ తాత్కాలికంగా నిలుపుదల చేశారు.

● అల్లవరం పీఏసీఎస్‌కు సోమవారం పది టన్నులు రాగా, మధ్యాహ్న సమయానికి అయిపోయాయి. గూడాల పీఏసీఎస్‌కు శనివారం రాత్రి పది టన్నులు రాగా అది కూడా అమ్మకాలు జరిగిపోయాయి. మరెక్కడా యూరియా లేదు.

● కొత్తపేట మండలంలో ఆదివారం 20 టన్నుల వరకు యూరియా వచ్చింది. ప్రైవేట్‌ డీలర్ల వద్ద తక్కువగా ఉంది. దాడులకు భయపడి డీలర్లు నిల్వలు చేయడం లేదు.

● ఐ.పోలవరం మండలం మొత్తానికి ఆదివారం కేవలం పది టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. పూర్తిస్థాయిలో యూరియా అందుబాటులో లేక రైతులు మండిపడుతున్నారు.

విజయవంతం చేయండి

కొత్తపేట/రావులపాలెం: కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా దగాపడిన రైతులకు బాసటగా నిలిచేందుకు వైఎస్సార్‌ సీపీ తలపెట్టిన ‘అన్నదాత పోరు’ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పార్టీ శ్రేణులు, రైతులకు పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోవడం, యూరియా కొరతపై రైతులకు బాసటగా వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ‘అన్నదాత పోరు’ పేరిట నిరసన కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందేనన్నారు. జిల్లాలోని అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి, ఆర్డీఓలకు వినతిపత్రాలు సమర్పించాలన్నారు. అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల వారు అమలాపురంలో, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల వారు కొత్తపేటలో, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల వారు రామచంద్రపురం డివిజన్‌ కేంద్రాలకు తరలివెళ్లి నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ఆర్డీఓలకు వినతులు సమర్పిస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు.

అదనపు ధరకు కొంటున్నాం

యూరియా సకాలంలో దొరకడం లేదు. పీఏసీఎస్‌, ఆర్‌ఎస్‌కేల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అరకొరగా దొరుకుతుంటే అదనంగా ధర పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. సాగులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

– గుబ్బల దుర్గాప్రసాద్‌, కేశనకుర్రు, ఐ.పోలవరం

ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు

యూరియా స్థానికంగా దొరకడం లేదు. దీనికోసం రోజుల తరబడి ఎదురు తెన్నులు చూడాల్సి వస్తోంది. ఎరువుల కొరత గతంలో లేదు. మా ఇబ్బందులు అర్థం చేసుకుని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.

– చీకురుమల్లి రత్నప్రసాద్‌, రైతు, పల్లంకుర్రు,

కాట్రేనికోన మండలం

నేడు ‘అన్నదాత పోరు’కు సన్నద్ధం

ఎరువుల బ్లాక్‌ మార్కెట్‌పై వైఎస్సార్‌ సీపీ అన్నదాత పోరు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డివిజన్ల వారీగా మంగళవారం అన్నదాత పోరు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రైతన్నకు బాసటగా వైఎస్సార్‌ సీపీ నిలబడుతోందని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజన్ల వారీగా అన్నదాత పోరు నిర్వహిస్తున్నారు.

బస్తామే సవాల్‌1
1/4

బస్తామే సవాల్‌

బస్తామే సవాల్‌2
2/4

బస్తామే సవాల్‌

బస్తామే సవాల్‌3
3/4

బస్తామే సవాల్‌

బస్తామే సవాల్‌4
4/4

బస్తామే సవాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement