
గోదావరిలో వృద్ధురాలి గల్లంతు
పి.గన్నవరం: ఆ వృద్ధురాలికి ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ గోదావరిలోకి దూకి తనువు చాలించాలని నిర్ణయించుకుంది. పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై నుంచి వైనతేయ నదిలోకి దూకి గల్లంతైంది. వివరాల్లోకి వెళితే. శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఎల్.గన్నవరం వైపున అక్విడెక్టు పార్కులోని గణేశ్ ఆలయం వద్ద ఏర్పాటు వినాయకుని ఉత్సవ విగ్రహాన్ని భక్తులు నదిలో నిమజ్జనం చేశారు. అంతకు ముందు కొద్ది సేపు సుమారు 75 ఏళ్ల వయసున్న ఆ వృద్ధురాలు ఆ ప్రాంతంలో తిరిగింది. వినాయకుని ఉత్సవ విగ్రహాన్ని కూడా దర్శించుకుంది. నిమజ్జనం జరుగుతున్న సమయంలో అక్విడెక్టుపై చెప్పులు విడిచి నదిలోకి దూకి గల్లంతైంది. ఆమె ఎరుపు, నలుపు రంగులతో ఉన్న చీర ధరించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ ఆ ప్రాంతాన్ని పరిశీలించి, వివరాలు సేకరిస్తున్నారు.