
గురువుకు విగ్రహం!
గురుభక్తిని చాటుకున్న పూర్వ విద్యార్థులు
రాజోలు: తల్లి, తండ్రి, గురువు ప్రత్యక్ష దైవాలు అనే మాటలను నిజం చేసి తమకు పాఠాలు బోధించిన గురువు విగ్రహాన్ని శిష్యులు గురువు ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. శుక్రవారం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజు చింతలపల్లి గ్రామంలో స్వర్గీయ ఉపాధ్యాయుడు గుబ్బల గంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన బోధించిన పాఠాలు, వ్యక్తిత్వ వికాసాలు, జీవిత మార్గదర్శకాలను ఆదర్శంగా తీసుకున్న పూర్వ విద్యార్థులు ఆయన ఇంటి ఆవరణలో గంగారావు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గురుభక్తిని చాటారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రాజు మాట్లాడుతూ గంగారావు గణిత బోధనలో గొప్పవారిగా నిలిచారన్నారు. ఆయన జ్ఞాపకార్థం శిష్యులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి, నాయకులు దంతులూరి చంటిబాబు, పెదబాబు, పి.గన్నవరం వైస్ ఎంపీపీ చెల్లుబోయిన గంగాదేవి, మాజీ సర్పంచ్ గెడ్డం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కోటసత్తెమ్మ
ఆలయం రేపు మూసివేత
నిడదవోలు రూరల్: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్టు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ శుక్రవారం తెలిపారు. ఆదివారం ఉదయం కోటసత్తెమ్మ అమ్మవారికి యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం 4 గంటలకు మూసివేసి తిరిగి 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ అనంతరం అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులంతా ఈ విషయాన్ని గమనించి అమ్మవారి దర్శనానికి రావాలని ఆయన పేర్కొన్నారు.