అశ్లీల నృత్యాలపై కేసు : ఐదుగురు నిర్వాహకుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అశ్లీల నృత్యాలపై కేసు : ఐదుగురు నిర్వాహకుల అరెస్టు

Sep 5 2025 5:32 AM | Updated on Sep 5 2025 5:34 AM

నల్లజర్ల: వినాయక నిమజ్జన ఊరేగింపులో భాగంగా అశ్లీల నృత్యాలు చేయించిన నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలికిచెర్లలో వినాయక నిమజ్జనం, ఊరేగింపులో గత నెల 31వ తేదీన హిజ్రాలతో ట్రాక్టర్‌పై అశ్లీల నృత్యాలు చేయించి ప్రజలకు ఇబ్బంది కల్గించిన కమిటీ సభ్యులు రుద్రా శ్రీనివాస్‌, పాలూరి సుబ్బారావు, కోట వెంకట శ్రీనివాస్‌, చౌటుపల్లి చిన్ననరసయ్య, అడ్డాల సత్తిపండుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ విలేకరులకు తెలిపారు. వీఆర్వో డి.శ్రీనివాస్‌ గురువారం ఇచ్చిన ఫిర్యాదుపై సెక్షన్‌ 292, 296, 50గా కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా సీఐ బాలశౌరి మాట్లాడుతూ ఊరేగింపులకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఊరేగింపులలో ఎటువంటి అశ్లీల నృత్యాలు నిర్వహించరాదని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా సౌండ్‌ సిస్టమ్‌లు పెట్టకూడదని, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

12,190 కిలోల రేషన్‌ బియ్యం పట్టివేత

సరకు విలువ రూ.5.61 లక్షలు

రాజానగరం: జాతీయ రహదారిపై స్థానిక బీపీసీఎల్‌ పెట్రోలు బంకు వద్ద అక్రమంగా రవాణా అవుతున్న 12,190 కిలోల రేషన్‌ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. టాటా మినీ లారీలో విజయవాడ నుంచి కాకినాడ పోర్టుకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు. లారీ ఓనర్‌ కం డ్రైవర్‌ అయిన పిఠాపురానికి చెందిన గాలి వెంకటేష్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.5,60,740 ఉంటుందని మండల పౌరసరఫరాల శాఖ అధికారి బాపిరాజు తెలిపారు.

దారి కాసి దాడి చేసి చోరీ

కె.గంగవరం: మండల పరిధిలోని అద్దంపల్లి–యర్రపోతవరం రహదారిలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపి అతని వద్ద ఉన్న సొమ్ము, స్కూటీ, బంగారాన్ని దోచుకుపోయారు. స్థానిక ఎస్సై జానీ బాషా తెలిపిన వివరాల మేరకు రామచంద్రపురం మండలం ద్రాక్షారామానికి చెందిన దినేష్‌ ఆదే గ్రామంలో బంగారు వస్తువులు విక్రయించే దుకాణంతో పాటు తాకట్టు వ్యాపారం చేస్తుంటాడు. ఇతని వద్ద పనిచేస్తున్న యండమూరి శ్రీనివాస్‌, విశ్వనాథం బుల్లియలు ద్రాక్షారామం నుంచి ప్రతి రోజు యానం వెళ్లి వ్యాపారం పూర్తయ్యాక రాత్రికి ఇంటికి తిరిగి వస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం శ్రీనివాస్‌ రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు అద్దంపల్లి గ్రామానికి చెందిన బుల్లియ్యను యానం నుంచి తన స్కూటీపై తీసుకుచ్చి అద్దంపల్లి గ్రామంలో దింపి తిరిగి ద్రాక్షారామానికి వెళ్తుండగా యర్రపోతవరం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి శ్రీనివాస్‌ను గాయపరిచి అతని వద్ద ఉన్న 12 గ్రామాల బంగారు ఆభరణాలతో పాటు రూ.5 వేల నగదు, స్కూటీ, పద్దు పుస్తకాలను పట్టుకుని వెళ్లిపోయారు. ఈ సంఘటనపై శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కె.గంగవరం ఎస్సై జానీ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement