
సూపరింటెండెంట్ సహా ముగ్గురు వైద్యుల గైర్హాజర్
ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డీఆర్వో ఆకస్మిక తనిఖీ
అమలాపురం టౌన్: అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని డీఆర్వో, ఆర్డీవో కొత్త మాధవి బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి నిర్వహణపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఆస్పత్రి సూపరింటెండెంట్ సహా ముగ్గురు ప్రధాన వైద్యులు విధులకు గైర్హాజరైనట్టు గుర్తించారు. సూపరింటెండెంట్ కె.శంకరరావు దీర్ఘకాల సెలవుపై వెళ్లగా, బుధవారం విధులకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కూడా గైర్హాజరైనట్టు డీఆర్వో గమనించారు. గైర్హాజరైన వైద్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏరియా ఆస్పత్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రికార్డులను, వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ అనూషను ఆదేశించారు. ఆస్పత్రిలో ఫిర్యాదుల బాక్సు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పలువురు రోగులతో మాట్లాడుతూ, వైద్య సేవలు, ఉచిత మందుల సరఫరా, శుభ్రత, అత్యవసర విభాగం పనితీరుపై ఆరా తీశారు. రెండో అంతస్తులో పనులను పరిశీలించారు. ఈ తనిఖీ పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని డీఆర్వో తెలిపారు. ఆమె వెంట అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ సీహెచ్ భరతలక్ష్మి ఉన్నారు.