
అదిగో జాగా.. ఇదిగో పాగా!
సాక్షి అమలాపురం: గోదావరి డెల్టాకు జీవనాడులైన ప్రధాన పంట కాలువలు, మురుగునీటి కాలువలు, వీటికి అనుబంధంగా ఉండే చానల్స్, మీడియం, మైనర్ డ్రెయిన్‌లు పలుచోట్ల ఆక్రమణదారుల బారిన పడి చిక్కి శల్యమవుతున్నాయి. సహజ సిద్ధమైన ప్రవాహాలను కోల్పోతున్నాయి. దీనివల్ల ఆయకట్టు రైతులు సాగు సమయంలో పడరాని పాట్లు పడుతున్నారు. తూర్పు, మధ్య డెల్టా అనే తేడా లేదు, పంట కాలువ, మురుగునీటి కాలువ అనే భేదం లేదు, పెద్దా, చిన్నా అనే అంతరం లేదు, కాలువలకు – రోడ్లకు మధ్య కొద్దిపాటి స్థలం ఉంటే చాలు కబ్జాల బారిన పడుతున్నాయి. చిరు వ్యాపారాలు చేసుకునే జాగాలో టింబర్ డిపోలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు జరిగిపోయాయి. పూరి గుడిసెల నుంచి రెండంతస్తుల పక్కా భవనాల వరకు నిర్మాణాలు చేసేశారు. చివరకు ఈ స్థలాలపై హక్కులున్న జలవనరుల శాఖకు చెందిన కార్యాలయాలను సైతం ఆక్రమించేశారు. ఇటీవల ఆ శాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 4,800 వరకు ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. వీటిని తమ శాఖతోపాటు రెవెన్యూ, పోలీసుల సహకారంతో తొలగిస్తామని ప్రకటించారు.
ఇతర శాఖల వత్తాసు
ఆక్రమణల తొలగింపు సాధ్యం కాదనేది పలువురి అభిప్రాయం. ఇటీవల కాలంలో పెరిగిన మితిమీరిన రాజకీయ జోక్యంతోపాటు పలు నిర్మాణాలకు సంబంధించి పక్కాగా దస్తావేజులు కూడా పుట్టుకురావడం వంటి కారణాలతో వీటి తొలగింపు కేవలం ప్రకటలకే పరిమితమనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలవనరుల శాఖకు చెందిన ఈ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తుంటే వీటికి రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్ శాఖలు వంత పాడుతుండడం గమనార్హం. ఈ నిర్మాణాలకు పంచాయతీ, మున్సిపల్ శాఖలు పన్నులు వసూలు చేస్తుండగా, రెవెన్యూ శాఖ పట్టాలు మంజూరు చేస్తోంది. విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నట్టుగా మారింది.
హద్దూ పద్దూ లేదు
జిల్లా వాణిజ్య కేంద్రంగా పేరొందిన రావులపాలెం మండలం మీదుగా మధ్య డెల్టాలోని మూడు ప్రధాన పంట కాలువలు ప్రవహిస్తాయి. ఈ మూడు కాలువల మీద ఈ మండలంలో ఆక్రమణలకు హద్దే లేకుండా పోయింది. ప్రధానంగా ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ మీద ఊబలంక, రావులపాలెంలో ఇరువైపులా అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇళ్లు, వాణిజ్య దుకాణాలు, ప్రార్థనా స్థలాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ కాలువలపై ఊబలంక నుంచి రావులపాలెం, కొమరాజులంక, వెదిరేశ్వరం ఇరువైపులా ఆక్రమణలతో నిండిపోయింది. అమలాపురం కాలువపై ఈతకోట– ర్యాలీ రహదారి వెంబడి కూడా ఆక్రమణలు అధికంగా ఉన్నాయి.
రావులపాలెం వద్ద ముక్తేశ్వరం కాలువ గట్లపై ఆక్రమణలు
కొత్తపేట కౌశిక డ్రెయిన్ ఇరువైపులా నిర్మాణాలు
గోదావరి డెల్టాలో కాలువల
వెంబడి ఆక్రమణలు
ఉమ్మడి జిల్లాలో
4,800 ఆక్రమణల గుర్తింపు
రెవెన్యూ, పోలీసు సహకారంతో తొలగిస్తామంటున్న ఇరిగేషన్ అధికారులు
రాజకీయ జోక్యంతో
అసాధ్యమంటున్న రైతులు
పలు ప్రాంతాల్లో పక్కాగా
భవన నిర్మాణాలు
చిరు దుకాణాల నుంచి
షాపింగ్ కాంప్లెక్స్‌ల వరకూ..
చిన్న కాలువలను కూడా వదల్లేదు
ఆలమూరు మండలం కోటిపల్లి ప్రధాన పంట కాలువ మీదనే కాదు... దీనికి అనుబంధంగా ఉండే చానల్స్‌ను కూడా అక్రమార్కులు వదల్లేదు. ప్రధాన పంట కాలువ పరిధిలో మూలస్థానం వద్ద ఏటిగట్లను ఆనుకుని నిర్మాణాలు చేశారు. ఆలమూరు సూర్యారావుపేట, వెదురుమూడి కాలువలు కూడా ఆక్రమణలకు చిక్కి శల్యమవుతున్నాయి.
మురుగునీటి కాలువను వదల్లేదు
కొత్తపేట నడిబొడ్డున ఉండే కౌశిక ఇది. ఆక్రమణలతో చిక్కి శల్యమైంది. మురుగునీటి కాలువకు ఇరువైపులా ఇళ్లు, ఇతర భవనాల నిర్మాణాలు జరిగిపోయాయి. కాలువల్లో పిల్లర్లు వేసి డాబాలు, మేడలు, రేకుల షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. వాడకం నీరంతా దీనికిలోకి వదిలేస్తున్నారు. మురుగునీరు దిగేందుకు మరో మార్గం లేకపోవడంతో దీనిని అమలాపురం పంట కాలువలోకి నేరుగా వదిలేస్తున్నారు. కొత్తపేట దిగువున ఉన్న అమలాపురం మున్సిపాలిటీతోపాటు అంబాజీపేట, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం మండలాల్లోని ప్రధాన రక్షిత మంచినీటి పథకాలకు ఈ నీరే వెళుతోంది.
మండపేట కాలువ గట్టుపై..
తూర్పు డెల్టా పరిధిలో కీలకమైన మండపేట కాలువ గట్టుపై అక్రమ నిర్మాణాలు లెక్కలేనన్ని. రాయవరం మండలం పసలపూడిలో కాలువ గర్భంలోకి వచ్చి మరీ నిర్మాణాలు చేశారు. ఈ కాలువపై మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీతోపాటు రామచంద్రపురం రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున సాగాయి. దీనివల్ల కీలక రబీ సమయంలో శివారుకు నీరందక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

అదిగో జాగా.. ఇదిగో పాగా!

అదిగో జాగా.. ఇదిగో పాగా!

అదిగో జాగా.. ఇదిగో పాగా!

అదిగో జాగా.. ఇదిగో పాగా!

అదిగో జాగా.. ఇదిగో పాగా!