
శ్రీరస్తు.. శుభమస్తు..
● వివాహ సందడి మళ్లీ ప్రారంభం
● నవంబర్ 26 వరకూ ముహూర్తాలే
● ఫంక్షన్ హాల్స్, టెంట్‌హౌస్‌లు, బ్యాండ్ మేళాలకు డిమాండ్
కాకినాడ సిటీ: సుమారు 80 రోజుల విరామం తర్వాత శుభకార్యాలకు మళ్లీ మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. దీంతో జోరుగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. మే 25 నుంచి జూలై 26 వరకు ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. శ్రావణ మాసం శుభకార్యాలకు శ్రేష్టం కావడం.. ఈ నెల 27 నుంచి నవంబర్ 26వ తేదీ వరకూ 35 మంచి ముహూర్తాలు ఉండటంతో లగ్గాలు, వివాహాలు, నూతన గృహ ప్రవేశాలు జోరుగా జరగనున్నాయి. ఈ నెల 30, 31; ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 20; సెప్టెంబర్ 24, 26, 27, 28; అక్టోబర్ 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31; నవంబర్ 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఈ నాలుగు నెలల్లో మొత్తం 35 ముహూర్తాలు ఉండటంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లెక్కకు మిక్కిలిగా వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు.
వీరికి డిమాండ్
వివాహాల సీజన్ మొదలవడంతో పురోహితులు, బ్యాండ్ మేళాలు, టెంట్‌హౌస్‌లు, డెకరేషన్, ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వీరిని ముందుగానే మాట్లాడుకున్నారు. పెళ్లివారు ముందుగానే అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారు. మరోవైపు ఫంక్షన్ హాళ్లకు కూడా ఎక్కడ లేని డిమాండూ వచ్చింది. ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించుకున్న వారు 2 నెలల ముందే ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,500కు పైగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్, మరో వెయ్యి వరకూ టీటీడీ, ప్రభుత్వ కమ్యూనిటీ హాళ్లు ఉన్నాయి. చాలా మంది ఫంక్షన్ హాల్స్ దొరక్కపోవడంతో ఇళ్ల వద్ద ఖాళీ స్థలాల్లో సైతం వివాహాలు జరపడానికి సిద్ధపడుతున్నారు.
ప్రారంభమైన వివాహాలు
శ్రావణ మాసం ప్రారంభం కావడం.. నవంబర్ 26 వరకూ వివాహ ముహూర్తాలు ఉండటంతో జిల్లాలో అధిక సంఖ్యలో జంటలు ఒక్కటి కానున్నాయి. ఇప్పటికే 150కి పైగా పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టాను.
– సుబ్రహ్మణ్యశాస్త్రి, పండితులు, కాకినాడ
టెంట్ హౌస్‌లకు ఫుల్ గిరాకీ
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందుగానే టెంట్‌హౌస్ సామగ్రిని బుక్ చేసుకుంటున్నారు. ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. సుమారు 80 రోజులుగా శుభకార్యాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాం. ప్రస్తుతం టెంట్‌హౌస్‌లకు గిరాకీ పెరిగింది.
– కొండబాబు,
టెంట్‌హౌస్ నిర్వాహకుడు, కాకినాడ

శ్రీరస్తు.. శుభమస్తు..