
రెగ్యులేటరీ బోర్డు నిర్ణయం మేరకు ఫీజులు
ప్రయివేట్ పాఠశాల యాజమాన్యాలకు ఆదేశం
అమలాపురం రూరల్: వినియోగదారుల ఫోరం, ప్రభుత్వ రెగ్యులేటరీ బోర్డు విధి విధానాల మేరకు ఫీజులను వసూలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సలీంబాషా, జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ భాస్కర్, ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యులు, ప్రయివేటు పాఠశాల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి ఫీజుల వసూలు, విద్యార్థుల బస్సులలో రవాణా భద్రత, స్థానికంగా పాఠ్య, నోటు పుస్తకాలు నిర్దేశిత ధరలకు విక్రయించడం వంటి అంశాలపై సమీక్షించారు. వారు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని పాఠశాలలకు ట్యూషన్ ఫీజు ఒకే విధంగా ఉంటుందన్నారు. పుస్తకాల ధరలలో వ్యత్యాసం వలన వినియోగదారులు నిలువునా మోసపోతున్నారని, ఫీజుల చెల్లింపు, పుస్తకాలు కొనేటప్పుడు రసీదులను తీసుకోవాలని చెప్పారు. నష్టపోయిన వినియోగదారుడు, వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించి న్యాయం పొందాలన్నారు. ఫీజుల వివరాలను పాఠశాల ముఖద్వారం వద్ద ప్రదర్శిచాలన్నారు. డిటీఓ డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ యాజమాన్యాలు పూర్తి ఫిట్నెస్‌తో బస్సులు నడపాలన్నారు. కోనసీమ వినియోగదారుల సంఘల చైర్మన్ అరిగెల బాలరామమూర్తి, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల ప్రతినిధులు, డిప్యూటీ డీఈవో జి.సూర్య ప్రకాష్, పరీక్షల కంట్రోలర్ హనుమంతరావు పాల్గొన్నారు.