అమ్మో.. వారధి | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. వారధి

Jul 26 2025 8:33 AM | Updated on Jul 26 2025 8:33 AM

అమ్మో

అమ్మో.. వారధి

ప్రమాదకరంగా దిండి–చించినాడ వంతెన

పాడైపోయిన బేరింగులు

నాణ్యత తనిఖీలో వెల్లడైన వైనం

‘సాక్షి’ కథనాలతో స్పందించిన అధికారులు

మూడు నెలల పాటు రాకపోకలు నిషేధం

మలికిపురం: కోస్తా తీరంలోని 216 జాతీయ రహదారిపై ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈ రహదారిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ – పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో దిండి – చించినాడ వద్ద వశిష్ట గోదావరిపై ఉన్న వంతెన ప్రమాదంలో ఉందని జాతీయ రహదారుల ఇంజినీర్లు గుర్తించారు. దాని బేరింగులు దెబ్బతినడంతో కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో దాదాపు మూడు నెలల పాటు భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. కేవలం మూడు టన్నుల లోపు లైట్‌ వెహికల్స్‌కు మాత్రమే అనుమతి ఉంది. అయితే పరిస్థితిని బట్టి అన్ని వాహనాల రాకపోకలను నిషేధించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ వంతెన పరిస్థితిపై గతంలోనే సాక్షి పత్రికలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. మే నెల ఏడో తేదీన ‘ప్రయాణం సురక్షితమేనా?’ అనే శీర్షికపై కథనం వచ్చింది. దానికి ఇంజినీర్లు స్పందించారు. పలుమార్లు మొబైల్‌ బ్రిడ్జ్‌ క్వాలిటీ వాహనంతో వంతెన నాణ్యతనుపరిశీలించారు.

బేరింగుల తనిఖీ

భారీ వాహనాలు వెళ్లే సమయంలో వంతెన బాగా స్వింగ్‌ అవుతోందని, దాని వల్ల వంతెనపై రోడ్డుకు చేస్తున్న మరమ్మతులు పాడైపోతున్నాయన్న కథనాలు సాక్షి పత్రికలో వరసగా ప్రచురితమయ్యాయి. దీనిపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫ్‌ హైవే (మోర్త్‌) అధికారులు హైదరాబాద్‌కు చెందిన లేన్‌ లాజిస్టిక్‌ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చి, మొబైల్‌ బ్రిడ్జి క్వాలిటీ ఇన్‌స్పెక్షన్‌ వెహికిల్‌ను తీసుకువచ్చి, బేరింగులను తనిఖీ చేయించారు. ఈ తనిఖీలో ఇంజినీర్లకు షాక్‌ ఇచ్చే అంశాలు బయట పడ్డాయి. ఏకంగా వంతెన బేరింగులు పాడైపోయాయని గుర్తించారు.

తరచూ మరమ్మతులు

బేరింగులు పాడైపోయిన విషయం ఈ నెల 23వ తేదీ బుధవారం జరిగిన మొబైల్‌ బ్రిడ్జి ఇన్‌స్పెక్షన్‌ వెహికిల్‌ తనిఖీలో బయట పడడంతో వెంటనే కలెక్టర్‌, ట్రాఫిక్‌ అధికారులతో సంప్రదించారు. అనంతరం మూడు నెలల పాటు రాకపోకలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వంతెనకు ఏడు పిల్లర్లు ఏర్పాటు చేశారు. నిర్మాణ ప్రారంభంలోనే చించినాడ వైపు నుంచి మూడో పిల్లర్‌ అప్పట్లో వరదలకు కూలి పోయింది. దీంతో కొంత కాలం పనులు ఆపేశారు. పైగా అప్పట్లో నిధులు కూడా కొరత ఉండేది. జీఎంసీ బాలయోగి లోక్‌ సభ స్పీకర్‌ అయ్యాక ఈ వంతెనపై ప్రత్యేక శ్రద్ధ చూపించి, పనులను పూర్తి చేయించారు. తొలుత వంతెన జాయింట్లలో రబ్బరు మెటీరియల్‌ ఉంచారు. అయితే ఏడాదిలోనే రబ్బరు మెటీరియల్‌ పాడైపోయింది. అక్కడి జాయింట్లు కూడా పగిలి పోవడంతో మరమ్మతులు జరిపారు. ఇలా ప్రతి ఏడాదీ జాయింట్లలో పగిలి పోవడం, అధికారులు మరమ్మతులు చేయడం జరుగుతోంది. కానీ ఈ ఏడాది ఏకంగా రెండు సార్లు పగిలిపోవడంతో మోర్త్‌ అప్రమత్తమైంది.

పెరిగిన వాహనాల రద్దీ

గడచిన పదేళ్లుగా నిమిషానికి 60 నుంచి 70 వాహనాలు ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. జాతీయ రహదారిగా మారడంతో పాటు చాలా చోట్ల నాలుగు లేన్లు పనులు పూర్తి కావడంతో వాహనాల తాకిడి అధికమైంది. చైన్నె నుంచి విశాఖపట్నం, కోల్‌కతాకు రాకపోకలు సాగించే వాహనాలు కూడా ఒంగోలులో ఎన్‌హెచ్‌ 16ను వీడి 216 జాతీయ రహదారి మీదుగా కోనసీమ జిల్లా నుంచి కాకినాడ జిల్లా కత్తిపూడికి తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వంతెన మాత్రం రెండు లేన్లుగా ఉండడంతో భారీ వాహనాల భారం అధికంగా పడిందనే వాదన కూడా ఉంది. ఐదేళ్ల క్రితం ఈ రహదారిలోని యానాం, మురమళ్ల, పాశర్లపూడి వంతెనల నాణ్యతను పరిశీలించి, తగిన విధంగా మరమ్మతులు చేశారు. కానీ దిండి – చించినాడ వంతెనను మాత్రం అభివృద్ధి చేయలేదు.

రాకపోకల నిషేధం

దిండి – చించినాడ వంతెనపై భారీ వాహనాల రాకపోకలకు దాదాపు మూడు నెలల పాటు నిషేధం ఉంటుందని ఎన్‌హెచ్‌ ఇంజినీర్లు తెలిపారు. అప్పటి వరకూ లైట్‌ వెయిట్‌ వాహనాలకు అనుమతి ఉంటుందన్నారు. అంటే దాదాపు మూడు టన్నుల లోపు వాహనాలు తిరగవచ్చని భావించారు. అయితే ఈ నెల 25న మరో ప్రత్యేక నాణ్యతా పరిశీలన వాహనం వచ్చి వంతెనను తనిఖీ చేసింది. దీని నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా మొత్తం అన్ని వాహనాల రాకపోకలను ఆపివేయాలా, తక్కువ బరువున్న వాటికి అనుమతి ఇవ్వాలా అనే విషయం తేలనుంది. వాస్తవంగా ఈ వంతెనపై 70 టన్నుల వరకూ భారీ వాహనాలు ప్రయాణించే అవకాశం ఉంది.

ప్రమాదాన్ని ముందే గుర్తించాం

వంతెన బేరింగులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అందుకే స్వింగ్‌ అధికమై తరచూ వంతెన రోడ్డు దెబ్బతింటోంది. ప్రత్యేక వాహనాలతో తనిఖీ చేసి, ప్రమాదం జరగకుండా ముందే లోపాలను గుర్తించాం. అన్ని పిల్లర్ల వద్ద బేరింగులను మార్చి మరమ్మతులు చేస్తాం. వంతెనకు రక్షణ గోడల నిర్మాణంతో పాటు లైటింగ్‌ కూడా ఏర్పాటు చేస్తాం.

– వెంకట రమణ, ఎన్‌హెచ్‌ అథారిటీ ఇంజినీర్‌

1995లో నిర్మాణం ప్రారంభం

వంతెన నిర్మాణాన్ని 1995లో ప్రారంభించారు. అనేక అవాంతరాల తర్వాత 2001లో పూర్తి చేశారు. అప్పట్లో ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ పనులు చేసింది. 2001 కన్నా ముందే పిల్లర్లకు వంతెనకు మధ్య బేరింగులు ఏర్పాటు చేశారు. సాధారణంగా వంతెన నిర్మించిన 20 ఏళ్లకు బేరింగులను మార్చాల్సి ఉంటుంది. అయితే కోస్తా తీరంలోని ఉప్పునీటి గాలులు, పర్యావరణ మార్పులకు ఈ బేరింగుల్లో సాంకేతిక లోపాలు వచ్చి ముందుగానే బలహీనపడ్డాయి. అయినా వంతెన నిర్మించి ఇప్పటికి 23 ఏళ్లు దాటింది. ఇన్నేళ్ల వరకూ అధికారులు దీన్ని తనిఖీ చేయకపోవడం గమనార్హం. ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారి అథారిటీ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా దీనికి మరో కారణం.

మిగిలిన వంతెనల పరిశీలన

దిండి – చించినాడ వంతెన నాణ్యత లోపాలను గుర్తించిన ఇంజీనీర్లు ఈ జాతీయ రహదారిపై అన్ని వంతెనల నాణ్యతను పరిశీలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు నుంచి వచ్చే పెద్ద కాలువలపై గల భారీ వంతెనలతో పాటు, కృష్ణానదిపై గల వంతెనను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు.

అమ్మో.. వారధి1
1/3

అమ్మో.. వారధి

అమ్మో.. వారధి2
2/3

అమ్మో.. వారధి

అమ్మో.. వారధి3
3/3

అమ్మో.. వారధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement