రాజోలు వైఎస్సార్‌ సీపీ పరిశీలకుడిగా నాగేంద్ర | - | Sakshi
Sakshi News home page

రాజోలు వైఎస్సార్‌ సీపీ పరిశీలకుడిగా నాగేంద్ర

Jul 16 2025 9:10 AM | Updated on Jul 16 2025 9:10 AM

రాజోల

రాజోలు వైఎస్సార్‌ సీపీ పరిశీలకుడిగా నాగేంద్ర

అమలాపురం టౌన్‌: రాజోలు నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ పరిశీలకునిగా అమలాపురానికి చెందిన పార్టీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వులను జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ద్వారా నాగేంద్ర మంగళవారం అందుకున్నారు. రావులపాలెం మండలం గోపాలపురంలోని క్యాంపు కార్యాలయంలో జగ్గిరెడ్డి ఆయనకు ఉత్వర్వులు అందజేసి అభినందించారు. వాస్తవానికి ఇటీవల రాజోలు నియోజకవర్గానికి పార్టీ పరిశీలకునిగా అమలాపురానికి చెందిన పార్టీ నాయకుడు వంటెద్దు వెంకన్నాయుడును నియమించారు. అయితే ఆయన అమెరికాలోని తన కుమారిడి వద్దకు వెళ్లారు. దీంతో ఆ పదవిలో నాగేంద్రను నియమించి భర్తీ చేశారు. ప్రస్తుతం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, పార్టీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న నాగేంద్ర గతంలో పార్టీ పట్టణ అధ్యక్షుడిగా సమర్ధవంతంగా పనిచేశారు. దీంతో నాగేంద్ర అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ జిల్లా పార్టీకి ఆయన పేరును సూచించారు. తనను రాజోలు పరిశీలకునిగా నియమించనందుకు మాజీ మంత్రి విశ్వరూప్‌కు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జగ్గిరెడ్డికి నాగేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు తన వంత కృషి చేస్తానని నాగేంద్ర తెలిపారు. తర్వాత రాజోలు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును కూడా నాగేంద్ర కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. నాగేంద్రతో పాటు పార్టీ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్‌ రాజా, మున్సిపల్‌ కౌన్సిలర్‌ చిట్టూరి పెదబాబు పాల్గొన్నారు.

ఉప్పాడ తీర ప్రాంత

కోత నివారణకు రక్షణ గోడ

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఉప్పాడ తీర ప్రాంతం కోత నివారణకు రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు దశాబ్దాలుగా యేటా సగటున 1.23 మీటర్లు మేర కోతకు గురవుతుండగా, ఒక్క 2017–18 ఏడాదిలోనే 26.3 మీటర్లు కోతకు గురైందన్నారు. ఇది ఉప్పాడ, నేమాం, అమీనాబాద్‌, సుబ్బంపేట, కొమరగిరి గ్రామాల మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. రక్షణ గోడ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి అందజేసిన ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను చైన్నెలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోస్టల్‌ రీసెర్చ్‌కు పంపించగా రూ.323 కోట్లతో టెట్రాపాడ్‌ల ఆధారంగా శాశ్వత రక్షణ గోడ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. వీటిని ఆమోదించేందుకు ఈ నెల 30న ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన సబ్‌ కమిటీ సమావేశం జరగనుందన్నారు.

వరుస పురస్కారాలపై హర్షం

కాకినాడ సిటీ: రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ మరొకసారి పురస్కారాలు పొందడం మనకు గర్వకారణమని రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు, కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రెడ్‌క్రాస్‌ శాఖ అధ్యక్షుడు, గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో 2021–22 నుంచి 2023–24 సంవత్సరం వరకు వరుసగా మూడు సంవత్సరాలు అత్యుత్తమ జిల్లా శాఖగా కాకినాడ జిల్లా మొదటి స్థానాన్ని గెలుచుకోగా పురస్కారాలను సంస్థ చైర్మన్‌ వైడీ రామారావు, కోశాధికారి ఎన్‌వీవీఆర్‌కె ప్రసాద్‌బాబు, కార్యదర్శి కె శివకుమార్‌ మంగళవారం కలెక్టర్‌కు అందజేసిన సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఉత్తమ జిల్లా శాఖ అవార్డులు ఏర్పాటు చేసినప్పటి నుంచి వరుసగా ఏడుసార్లు మన జిల్లా శాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. చైర్మన్‌ వైడీ రామారావు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని నూతన సేవా కార్యక్రమాల ద్వారా రెడ్‌క్రాస్‌ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి కృషి చేస్తామన్నారు. ఇటీవల రెడ్‌క్రాస్‌కు సేవలు అందించి గవర్నర్‌ ద్వారా పురస్కారాలు అందుకున్న ఓఎన్‌జీసీ, కేఎస్‌పీఎల్‌ ప్రతినిధులకు, సాయిరామ ప్రోజెన్‌ ఫుడ్స్‌ అధినేత ఎల్‌ సత్యనారాయణ, ఫిలిం డైరెక్టర్‌ బి సుకుమార్‌లకు కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

రాజోలు వైఎస్సార్‌ సీపీ పరిశీలకుడిగా నాగేంద్ర 1
1/1

రాజోలు వైఎస్సార్‌ సీపీ పరిశీలకుడిగా నాగేంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement