
పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు రద్దు చేయాలి
అమలాపురం రూరల్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆర్థిక బిల్లుతో ఆమోదించిన పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వ పెన్షనర్లు అసోసియేషన్ జిల్లా శాఖ అధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. తొలుత పారుపూడి కృష్ణశాస్త్రి ధర్నాను ప్రారంభించారు. దశాబ్దాల పాటు పోరాటాలు చేసి పెన్షనర్స్ సాధించుకున్న హక్కులు, ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాయడం అమానుషమని, దీనిపై అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఫెడరేషన్, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి, గుంటూరు సంయుక్తంగా పెన్షనర్ల హక్కుల పరిరక్షణకు విధి లేని పరిస్థితులలో పోరుబాటను ఎంచుకోవలసి వచ్చిందని జిల్లా ప్రధాన కార్యదర్శి కేకేవీ నాయుడు డిమాండ్ చేశారు. ఈ సవరణ అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రమే కాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా నష్టపోయే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్సీ, పెన్షనర్ యిళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగ, పెన్షనర్లకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ అమలు చేయాలనికోరారు. జేఏసీ చైర్మన్ సీహెచ్ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కోదండ రామయ్య, ట్రెజరర్ దోనిపాటి పృథ్వీ, మండలీక ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ పోతంశెట్టి దొరబాబు, ఎం.సాయి వరప్రసాదరావు తదితరులు కలెక్టర్‌కు ఈ మేరకు వినతి పత్రాన్ని అందించారు.