
అన్నదాతకు అండ
● పంటల పరిరక్షణలో గుడ్ల ద్రావణం
● ప్రకృతి వ్యవసాయంలో
ఎగ్ అమ్మోనియా యాసిడ్ తయారీ
● చీడపీడలకు, నాణ్యమైన
ఉత్పత్తికీ ఎంతో ఉపయుక్తం
పిఠాపురం: రోజు గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండని వైద్యులు సూచిస్తుంటారు. మంచి బలవర్ధకమైన ఆహారంగా గుర్తించబడిన గుడ్డు ఇప్పుడు పంటలకు సైతం మంచి పోషకరంగా పని చేస్తోంది. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో అనేక ద్రావణాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం గుడ్ల ద్రావణం మంచి ప్రాముఖ్యతను సంతరించుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందించే ద్రావణంగా దీనికి గుర్తింపు రావడంతో గొల్లప్రోలు మండలం దుర్గాడ గో గాయత్రి ప్రకృతి వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో గుడ్ల ద్రావణం తయారీ చేపట్టారు. దీని తయారీ విధానాన్ని కేంద్రం నిర్వాహకుడు గుండ్ర శివచక్రం వివరించారు.
తయారీ విధానం ఇదీ..
ముందుగా గుడ్లను పగలకుండా జాగ్రత్తగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటిని శుభ్రం చేసుకుని సిద్ధం చేసుకున్న ప్లాస్టిక్ జార్‌లో జాగ్రత్తగా పెట్టి అవి పూర్తిగా మునిగే వరకు నిమ్మరసంతో నింపాలి. దానికి మూతపెట్టి ఎండ తగలని చోట పెట్టుకోవాలి. దీనిని ప్రతీ రోజు గమనిస్తూ ప్లాస్టిక్ జార్ మూతను తీసి పెడుతుండాలి. లేకపోతే దానిలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ప్రభావంతో జార్ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా 10 నుంచి 15 రోజులకు నిమ్మరసంలో మునిగి ఉన్న కోడిగుడ్లు కరిగిపోయి చిక్కటి ద్రవంగా మారిపోతుంది. దానిని జాగ్రత్తగా కలిపి ఆ ద్రావణంలో 250 నుంచి 500 గ్రాముల బెల్లాన్ని మెత్తని చూర్ణంగా చేసి కలుపు కోవాలి. అలా కలిపిన ద్రావణాన్ని మళ్లీ నీడగా ఉండే చోట భద్రపర్చుకోవాలి. ఇలా మరో 15 రోజుల వరకు ప్రతి రోజు ఉదయం సాయంత్రం గమనిస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా 20 నుంచి 30 రోజుల తరువాత తెల్లటి బాదం పాలు మాదిరిగా ఒక రకమైన ద్రావణం తయారవుతుంది. దీనినే గడ్లు ద్రావణం, ఎగ్ అమోనియా యాసిడ్ అంటారు. దీనిని మరో బాటిల్‌లోకి తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి. దీనికి నీటి తడి ఎట్టి పరిస్థితుల్లోను తగలకుండా చూసుకోవాలి. దీనిలో అమ్మోనియా యాసిడ్స్, ప్రొటీన్లు, మైక్రో న్యూట్రియంట్స్, మేక్రో న్యూట్రియంట్స్‌తో పాటు పుష్కలంగా కాల్షియం ఉంటుంది.
వినియోగం ఇలా..
గుడ్ల ద్రావణం తయారైన తరువాత పూత దశ దాటిన పంటకు ఒక లీటరు నీటికి 2 నుంచి 3 మిల్లీ లీటర్ల ద్రావణం కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే పూత దశకు వచ్చాక ఒక లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల ద్రావణం కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక ఎకరం పొలానికి 200 లీటర్ల నీటికి ఒక లీటరు ద్రావణం కలిపి పచికారీ చేసుకోవచ్చు. దీనిని నెలకు ఒక సారి పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ప్రయోజనాలు అనేకం
ప్రతి పంటకు దీనిని పిచికారీ చేయడం వల్ల పూత ఆశాజనకంగా నాణ్యమైన ఆరోగ్యవంతంగా వస్తుంది. పిందె నిలబడడానికి, ఆరోగ్యవంతంగా తయారవ్వడానికి ఇది ఎంతో దోహద పుడుతుంది. పిందె రాలిపోకుండా కాపాడుతుంది. గుడ్డు ద్రావణంలో గుడ్డు తొక్కతో సహా కరిగించడం వల్ల అధికంగా కాల్షియం ఉత్పత్తి అయ్యి మొక్కలకు మంచి కాల్షియం అందిస్తాయి. మొక్కలకు అత్యంత అవసరమైన కాల్షియం అందడం వల్ల పంటలు నాణ్యమైన దిగుబడులు ఇస్తాయి. భూమి సారవంతమై మేలు చేసే బ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఇది మొక్కలు వత్తిడి నుంచి బయటపడేలా చేస్తాయి, తద్వారా తెగుళ్లు పురుగులు అంత త్వరగా సోకే అవకాశం లేకుండా పోతుంది . దీనివల్ల క్లోరోఫిల్ పర్సంటేజ్ పెరుగుతుంది. తద్వారా పంటలలో ఆకులు పచ్చగా తయారై కిరణ జన్య సంయోగ క్రియ సక్రమంగా జరిగి పిండి పదార్థాలను మొక్కలు ఎక్కువగా తయారు చేసుకుంటాయి. దీనివల్ల మొక్కలు గుబురుగా పెరగడంతో పాటు కాయల పరిమాణం పెద్దవిగా ఉండి పంట దిగుబడులు పెరుగుతాయి. అదే పప్పు ధాన్యాలలో అయితే గింజలు నాణ్యంగా తయారవుతాయి. దీనిని నుంచి వచ్చే వాసన వల్ల కొన్ని రకాల పురుగులు పంటలకు సోకవు. ఇది మంచి పెస్ట్ కంట్రోలర్‌గా పని చేస్తుంది. రూ.వేలు ఖర్చు పెట్టి రసాయానాలు ఉపయోగించినా రాని ఫలితం కేవలం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.
– గుండ్ర శివ చక్రం, గో గాయత్రి
ప్రకృతి వనరుల తయారీ శిక్షణ కేంద్రం, దర్గాడ
కావాల్సిన పదార్థాలు ఇవీ
2 లీటర్ల యాసిడ్ తయారీకి..
కోడిగుడ్లు – 12
నిమ్మకాయలు (బాగా మగ్గినవి) – 2 కేజీలు
బెల్లం – 250 నుంచి 500 గ్రాములు
మూడు లీటర్ల సామర్థ్యం గల ప్లాస్టిక్ మగ్ – 1

అన్నదాతకు అండ

అన్నదాతకు అండ

అన్నదాతకు అండ