
లంకలపై గోదావడి
● ముంచుకొస్తున్న వరద నీరు
● పి.గన్నవరంలో నాలుగు
గ్రామాలకు రాకపోకలు బంద్
● పడవలపై ప్రయాణాలు
● ముక్తేశ్వరం – కోటిపల్లి రేవు బంద్
● కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి
● ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఉదయం
2.82 లక్షల క్యూసెక్కుల విడుదల
● సాయంత్రానికి 3.54 క్యూసెక్కులకు చేరిక
సాక్షి, అమలాపురం: గోదావరి ఉరకలేస్తోంది. అఖండ గోదావరిలో వరద పెరుగుతుండగా.. దిగువ నదీపాయలలో లంకలను వరద తాకుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు మిగులు జలాలు పెద్ద ఎత్తున విడుదల చేస్తుండడంతో కోనసీమ జిల్లాలో వరద పెరుగుతోంది.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వారం రోజుల క్రితం పెరిగి తగ్గిన వరద గురువారం నుంచి తిరిగి పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2,45,910 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. వచ్చిన నీటిని తూర్పు డెల్టాకు 4 వేల క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2,450 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 6,500 చొప్పున 13,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇదే సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు 2,32,160 క్యూసెక్కులను విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో వరద మరింత పెరగడంతో దిగువకు 3,54,341 క్యూసెక్కులను వదిలిపెట్టారు. పోలవరం, భద్రాచలం వద్ద వరద పెంపు ప్రభావం జిల్లాలోని లంక ప్రాంతాలపై పడింది. పి.గన్నవరం, కపిలేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, మామిడికుదురు మండలాలోని లంక గ్రామాలను వరద నీరు తాకుతోంది.
ఇక పడవ ప్రయాణాలే..
పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక వెళ్లే తాత్కాలిక రహదారి వరదకు కొట్టుకుపోయింది. దీనితో జి.పెదపూడిలంక, బూరుగులంక, ఊడిముడిలంక, అరిగెలవారిపాలెం గ్రామాలకు నేరుగా రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా యంత్రాంగం ఇక్కడ పడవలను ఏర్పాటు చేసింది. విద్యార్థులు, మహిళలు, రైతులు, స్థానికులు రోజువారీ ప్రయాణాల కోసం పడవలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ గ్రామాలకు చెందినవారు నవంబరు నెలాఖరు వరకు అంటే ఇంచుమించు నాలుగు నెలలకు పైగా ఇక పడవల మీదే రాకపోకలు చేయాల్సి ఉంది. వరద ఉధృతి మరింత పెరిగే కొద్దీ స్థానికుల కష్టాలు రెట్టింపు కానున్నాయి. వరదలకు గ్రామాల్లో ఇళ్లల్లోకి ముంపు నీరు చేరుతుంది. ఈ సమయంలో స్థానికులు డాబాలు, మేడలు, ప్రభుత్వం ఏర్పాటు చేసే తాత్కాలిక పునరావస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిందే. రైతులు పండించే పంటలను పడవల మీద తరలించాల్సి వస్తుంది. ఇది వారికి భారం కానుంది. వరద ఉధృతి పెరిగితే పంటలు నష్టపోవడం పరిపాటి. విద్యార్థులు, మహిళలు, అనారోగ్య బాధితులు ఈ నాలుగు నెలలు పడవలపై ప్రయాణాలు చేయడం తప్పని పరిస్థితి. వరద మరింత పెరిగితే రెండో వైపు ఉన్న కాజ్‌వే సైతం ముంపు బారిన పడి ఈ లంక వాసులు అక్కడ కూడా మరోసారి పడవల మీద ప్రయాణం చేయాల్సి ఉంది. ఇదే మండలాన్ని ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కనకాయలంక, అనగారిలంక, పుచ్చల్లంక వాసులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.
ఈ గ్రామాల అవస్థలను చూసి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఊడిముడిలంక వంతెనకు రూ.49 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో వేగంగా సాగిన పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నత్త నడకన సాగుతున్నాయి. పనువు వేగంగా సాగి ఉంటే స్థానికుల కష్టాలు చాలా వరకు తీరేవి.
కోటిపల్లి – ముక్తేశ్వరం రేవు ప్రయాణం సైతం నిలిచిపోయింది. ఇక్కడ కూడా గౌతమి ఉధృతికి ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి సైతం కొట్టుకుపోయింది. ఈ కారణంగా రేవు మూసివేశారు. అమలాపురం నుంచి ముక్తేశ్వరం కోటిపల్లి మీదుగా రామచంద్రపురం, కె.గంగవరం మండలంలోని గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు వీరంతా ఇటు రావులపాలెం, జొన్నాడ మీదుగా లేదా అటు ముమ్మిడివరం, యానం మీదుగా రాకపోకలు చేయాల్సి ఉంది. ప్రధానంగా రైతులు, వ్యవసాయ కూలీలకు రేవు ప్రయాణాలు నిలిచిపోవడం భారంగా మారనుంది. వరద ఉధృతి పెరిగితే సఖినేటిపల్లి – నరసాపురం, సోంపల్లి – అబ్బిరాజుపాలెం, జి.మూలపొలం – పల్లంకురు రేపు ప్రయాణాల సైతం నిలిచిపోను న్నాయి.

లంకలపై గోదావడి

లంకలపై గోదావడి

లంకలపై గోదావడి