
డొక్కలెండుతున్నాయ్!
● కొండెక్కిన కొబ్బరి కాయలు
● తిరోగమనంలో డొక్క ధర
● రైతుల వద్ద టన్నుల కొద్దీ నిల్వలు
● రెండు నెలల కిందట ట్రాక్టర్
సరకు రూ.1,500
● ఇప్పుడు రూ.500 ఎదురు
ఇచ్చి ఎగుమతులు
సాక్షి, అమలాపురం: కొబ్బరి ధర కొండెక్కింది.. రికార్డు స్థాయిలో పెరిగింది.. దానికి తగ్గట్టు పెరగాల్సిన పీచు ఉత్పత్తుల ధర తిరోగమనంలో కొట్టుమిట్టాడుతుంది.. ఇలా పీచు పరిశ్రమ విలవిల్లాడుతోంది.. టన్నుల కొద్దీ పేరుకుపోతున్న కొబ్బరి డొక్క రైతులకు శిరోభారంగా మారింది. అత్యంత విలువైన డొక్క కొంత రోడ్ల వెంబడి, తోటల్లో చెత్తగా మారిపోతుండగా, మరికొంత అగ్నికి ఆహుతవుతోంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పీచు పరిశ్రమ అత్యంత పెద్దది. కొబ్బరి సాగు జరుగుతున్న ప్రాంతాల్లో పీచు, దాని అనుబంధ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు భారీ ఎత్తున ఉన్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా, ఒక్క డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాలు ఉంది. ఇక్కడ కొబ్బరి అనుబంధ పరిశ్రమల్లో క్వాయర్ ఉత్పత్తులది అగ్రస్థానం. విలువ ఆధారిత పరిశ్రమల్లో 80 శాతం క్వాయర్ ఆక్రమించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 వరకూ చిన్న, పెద్దా పీచు ఉత్పత్తి కేంద్రాలు ఉంటే, ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 740 వరకూ పీచు, తాళ్ల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీచు ఉత్పత్తి కేంద్రంలో రోజుకు టన్ను నుంచి ఐదు టన్నుల వరకూ పీచు ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి రూ.125 కోట్ల విలువైన పీచు, ఇతర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని అంచనా. ఎగుమతుల్లో సింహభాగం అంటే 70 శాతం చైనాకు వెళ్తుండగా, మిగిలిన ఎగుమతి మలేషియా, సింగపూర్, జపాన్‌తోపాటు గల్ఫ్, యూరప్ దేశాలకు ఉంటుంది.
అంతకంతకూ పతనం
ప్రస్తుతం కొబ్బరి కాయ ధర రూ.22 పలుకుతోంది. కానీ విచిత్రంగా కొబ్బరి పీచు ధరలు మాత్రం పతనమయ్యాయి. ఎగుమతులూ తగ్గాయి. తడి పీచు కిలో రూ.ఆరు పలుకుతుండగా, పొడి పీచు రూ.8 వరకూ ఉంది. తడి పీచు ఎండబెట్టి బేళ్లుగా మార్చి విక్రయిస్తే కిలో రూ.12 వరకూ వస్తోంది. కానీ పెట్టుబడి వ్యయం పెరగడంతో గిట్టుబాటు కావడం లేదు. తడి పీచు సగటు ధర కిలో రూ.తొమ్మిది వరకూ ఉండగా, ఇప్పుడు రూ.ఆరుకు చేరింది. చివరకు కొబ్బరి తాళ్ల ధరలు సైతం తగ్గాయి. 24 అడుగుల 100 ముక్కల కట్ట హైదరాబాద్ మార్కెట్‌లో రూ.150 మాత్రమే ఉంది. గతంలో ఇది రూ.220 వరకూ పలికేది. ముంబయికి వెళుతున్న తాళ్లకు మాత్రం రూ.180 వరకూ వస్తోంది.
పెరిగిన ఉత్పత్తి వ్యయం
ఇటీవల కాలంలో పీచు, తాళ్లు, కొబ్బరి పొట్టు వంటి ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగింది. పీచు పరిశ్రమ నష్టాలకు ఇది కొంత కారణమవుతోంది. ఒక్క కార్మికుడికి రోజు వేతనం రూ.600 వరకూ ఉంది. ఆధునిక యంత్రాలు వచ్చిన తరువాత కార్మికుల సంఖ్య తగ్గిందని, కానీ వారికి చెల్లించే జీతం పెరిగిందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు.
విద్యుత్ బిల్లుల షాక్
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పీచు పరిశ్రమల యజమానులకు విద్యుత్ చార్జీల షాక్ తగులుతోంది. యూనిట్ విద్యుత్ ధర రూ.ఆరు. కానీ అదనపు లోడు వినియోగం, ఇంధన చార్జీలు, అపరాధ రుసుం పేరుతో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. యూనిట్ ధర రూ.10 నుంచి రూ.12 వరకూ కావడంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది. నాలుగు వేల యూనిట్లు వచ్చే మధ్య తరహా పరిశ్రమకు రూ.24 వేల విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా, కొంతమందికి రూ.40 వేల వరకూ వస్తోంది.
ఎక్కడికక్కడే పేరుకుపోయి..
రెండు నెలల కిందట టన్ను కొబ్బరి డొక్కను స్థానిక పీచు ఉత్పత్తిదారులు రూ.1,500కు కొనుగోలు చేశారు. ఇప్పుడు కొనుగోలు నిలిచిపోవడంతో కొబ్బరి తోటల్లో డొక్క టన్నుల కొద్దీ ఉండిపోయింది. ఈ డొక్కను ఉచితంగా తీసుకు వెళ్లాలని రైతులు పరిశ్రమల యజమానులను వేడుకుంటున్నారు. అవసరమైతే ట్రాక్టర్‌కు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ ఎదురిచ్చి వదిలించుకునే పనిలో పడ్డారు. ఇదే సమయంలో తమిళనాడులో కొబ్బరి ఉత్పత్తి తగ్గడం వల్ల అక్కడ పీచు పరిశ్రమల యజమానులు రాష్ట్రంలోని చిత్తూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి డొక్క కొనుగోలు చేసి తీసుకు వెళ్తుండడం గమనార్హం. ఇక్కడ తోటల్లో పేరుకుపోయిన డొక్కను నిర్జీవ ప్రాంతాలకు తరలించడం, లేకుంటే తగలబెట్టడం చేస్తున్నారు.
భారీ పరిశ్రమలు రావాలి
పీచు పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే జిల్లాలో భారీ పరిశ్రమలు రావాలి. ఒక్కో పరిశ్రమ వద్ద పలు రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు కావాలి. ప్రతి మండలంలో క్వాయర్ క్లస్టర్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ప్రైమిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ)లో ఇప్పుడు రూ.50 లక్షల వరకూ రాయితీతో కూడిన రుణం ఇస్తుంది. ఇది కనీసం రూ.కోటికి పెంచాలి. అప్పుడు పలు రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చు.
– వేగి వెంకటేశ్వరరావు, డైరెక్టర్,
కోనసీమ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ డైరెక్టర్
యాంత్రీకరణ అవసరం
తమిళనాడు పీచు ఉత్పత్తిదారులు ఒక్కడి కొబ్బరి డొక్కను కొనుగోలు చేసి పీచు ఉత్పత్తి చేస్తున్నారు. కొనుగోలు, రవాణా ఖర్చులు భారమే అయినా వారికి లాభాలు వస్తున్నాయి. మన పీచు ఉత్పత్తిదారులకు ఆధునిక యంత్రాలు లేక లాభాలు రావడం లేదు. స్థానికంగా ఉత్పత్తి తగ్గడం వల్ల రైతుల వద్ద డొక్క వృథాగా పేరుకుపోతోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలి.
– పెదమల్లు నాగబాబు,
క్వాయర్ రంగ నిపుణుడు, పాశర్లపూడిలంక

డొక్కలెండుతున్నాయ్!

డొక్కలెండుతున్నాయ్!

డొక్కలెండుతున్నాయ్!

డొక్కలెండుతున్నాయ్!

డొక్కలెండుతున్నాయ్!

డొక్కలెండుతున్నాయ్!