
వైఎస్సార్ సీపీలో సామాజిక సమతూకం
పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి
కొత్తపేట: వైఎస్సార్ సీపీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అన్ని కమిటీల్లో సామాజిక సమతూకం పాటిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఇటీవల ప్రకటించిన జిల్లా కమిటీలో కొత్తపేట మండలం పలివెలకు చెందిన షేక్ వల్లీబాబా సెక్రటరీ యాక్టివిటీగా నియమితులైన విషయం తెలిసిందే. ఆయన నియోజకవర్గ ముస్లిం నాయకులతో కలసి గురువారం రావులపాలెం మండలం గోపాలపురంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జగ్గిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు ముస్లిం సంప్రదాయ టోపీ అందించి సత్కరించారు. ప్రతిగా జగ్గిరెడ్డి వల్లీబాబాను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ కమిటీల్లో ముస్లింలకు ప్రాధాన్యం కల్పించడంలో భాగంగా వల్లీబాబాకు సెక్రటరీ యాక్టివిటీగా పదవి ఇచ్చామన్నారు. ముస్లింలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రావులపాలెం పెద్ద, చిన్న మసీదుల అధ్యక్షులు బాషా, మీరా, ఉపాధ్యక్షుడు జహంగీర్, కోశాధికారి జహంగీర్, సభ్యులు సందాని, అమీర్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నారి వైద్యానికి చేయూత
రావులపాలెం: ఆరేళ్ల చిన్నారి వైద్యానికి రావులపాలెం కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యులు రూ.1.25 లక్షల సాయం అందించారు. పెరవలి గ్రామానికి చెందిన కళ్యాణి మౌనిక (6) నాలుగు నెలల కిందట కాగితాలు వెలిగించి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ శరీరమంతా కాలిపోయింది. ఇప్పటి వరకూ రెండు సర్జరీలు చేశారు. ఇంకా వైద్యం అందించాల్సి ఉంది. ఈ ప్రమాదం జరిగాక చిన్నారి పరిస్థితి చూసి బెంగతో ఆమె తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. పేద కుటుంబం కావడంతో సాయం కోసం కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యులను ఆశ్రయించింది. దీంతో సంస్థ సభ్యులు పెరవలి వెళ్లి దాతల ద్వారా సేకరించిన మొత్తం రూ. 1.25 లక్షలను మౌనికకు అందజేశారు.
పంచాయతీకి ‘పచ్చ’పాతం
అమలాపురం రూరల్: గున్నేపల్లి అగ్రహారం పంచాయతీ కార్యాలయం పచ్చరంగును పులుముకుంది. ఇది టీడీపీ కార్యాలయాన్ని తలపించింది. పంచాయతీ కార్యాలయం ఆనుకుని ఎంపీపీ పాఠశాలలో మెగా పీటీఎం కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయాన్ని మూసివేసేలా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, సర్పంచ్ పెద్దిరెడ్డి రాముతో ముద్రించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయం పేరు కూడా కనిపించకుండా ఫ్లెక్సీని పెట్టడంపై విస్మయం చెందారు. పంచాయతీ కార్యాలయాల కు పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, స్టిక్కర్లు, ప్రజాప్రతినిధుల ఫొటోలు అతికించరాదని నిబంధన ఉంది. అయినా ఇలా ఏర్పాటు చేసినా అధికారులు ప ట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇది పంచాయతీ కార్యాలయమా.. లేక టీడీపీ కార్యాలయమా అని మండిపడ్డారు.
రబీ ధాన్యం సొమ్ము విడుదల
సాక్షి, అమలాపురం: జిల్లాలో రబీ ధాన్యం సొమ్ములు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో సొమ్ములు చెల్లిస్తామన్న కూటమి ప్రభుత్వం రెండు నెలల తరువాత ఈ సొమ్ములు విడుదల చేయడం గమనార్హం. జిల్లాలో 379 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా 32,996 రైతుల వద్ద నుంచి రూ.620.98 కోట్ల విలువైన 2,69,986 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దీనిలో 23,491 రైతుల ఖాతాల్లో రూ.432.11 కోట్లు చెల్లించారు. మిగిలిన 9,505 రైతులకు రూ.188.87 కోట్లను పెండింగ్‌లో ఉంచారు. వీటిని గురువారం చెల్లించినట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పి.శ్రీనివాస్ తెలిపారు.

వైఎస్సార్ సీపీలో సామాజిక సమతూకం

వైఎస్సార్ సీపీలో సామాజిక సమతూకం