
బాలాజీస్వామికి దండిగా ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఉభయ దేవేరులతో కొలువైన స్వామివారికి సుప్రభాత సేవతో మేలు కొలుపు చేసి తొలి హారతి ఇచ్చారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.3,75,490 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు. స్వామి వారి నిత్యాన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.1,00,480 విరాళంగా అందించారన్నారు. 5,500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని తెలిపారు. 3,200 మంది స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారన్నారు.
శనైశ్చరునికి ప్రత్యేక పూజలు
కొత్తపేట: మండల పరిధిలోని మందపల్లిలో శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి ప్రాతఃకాల అర్చన అనంతరం భక్తులు తైలాభిషేకాలు, సర్వదర్శనాలు చేసుకున్నారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు ఆధ్వర్యంలో సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. టిక్కెట్లు, వివిధ సేవల ద్వారా రూ.1,73,820 ఆదాయం వచ్చినట్లు ఈఓ సురేష్‌బాబు తెలిపారు. అలాగే అన్నప్రసాద పథకానికి పలువురు భక్తుల ద్వారా విరాళాల రూపంలో మరో రూ.41,203 రాగా మొత్తం 2,15,023 ఆదాయం వచ్చినట్టు ఆయన తెలిపారు. సిబ్బంది, పలువురు గ్రామస్తులు భక్తులకు అన్నప్రసాద సేవలో పాల్గొన్నారు. తెలంగాణా ఆర్టీసీ ఎండీ/అదనపు డీజీపీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ సతీ సమేతంగా శనైశ్చరుని దర్శించి, ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థానం అధికారులు వారికి ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
దోమల నివారణకు చర్యలు
జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వరరావు
కొత్తపేట: డ్రెయిన్లు, మురుగునీటి నీటి గుంటలు, నీటి నిల్వల్లో గంబూషియా చేపలను వదలి దోమలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో దోమల లార్వాను నియంత్రించి, తద్వారా దోమల నివారణపై వైద్య, ఆరోగ్య శాఖ కొత్తపేట, రావులపాలెం సబ్ యూనిట్ల పరిధిలోని ఆరు మండలాల హెల్త్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించారు. జిల్లాలో డ్రైన్లు, నీటి నిల్వల్లో లార్వా నియంత్రణకు మత్స్యశాఖ కడియం హేచరీస్ నుంచి 1.50 లక్షల గంబూషియా చేపలను తీసుకువచ్చి వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో 60 రెసిడెన్షియల్ హాస్టళ్లు ఉన్నాయని, అన్ని హాస్టల్స్‌లోనూ లోపలి గోడలకు ఏసీఎం 5 శాతం మందు పిచికారీ చేయించినట్టు తెలిపారు. జిల్లాలో 49 గ్రామీణ పీహెచ్‌సీలు, 7 అర్బన్ పీహెచ్‌సీల ద్వారా గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటినీ సందర్శించి సీజనల్ వ్యాధులపై సర్వే చేస్తున్నారన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 15 డెంగీ, 2 మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు.
నేటి నుంచి రాష్ట్ర
పంచాంగకర్తల విద్వత్ సభలు
అమలాపురం టౌన్: అఖిల భారత బ్రాహ్మణ మహా సంఘ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీ కాసు కళ్యాణ మండపంలో ఆదివారం నుంచి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ పంచాగ కర్తల విద్వత్ సభలు జరుగుతాయని మహాసంఘ్ సభ్యుడు, అమలాపురం పంచాంగ కర్త ఉపద్రష్ట నాగాదిత్య తెలిపారు. అఖిల భారత బ్రాహ్మణ మహా సంఘ్ (ఏబీబీఎం) ఉభయ తెలుగు రాష్ట్రాల ఉపాధ్యక్షుడు డాక్టర్ నిట్టల వీఎస్‌ఆర్ కృష్ణ ప్రసాద్ పిలుపు మేరకు జిల్లాలోని పంచాంగ కర్తలు ఈ సమావేశాలకు విధిగా హాజరై విజయవంతం చేయాలని నాగాదత్య విజ్ఞప్తి చేశా రు. 15న పంచాంగకర్తలకు శ్రీగురు పురస్కారా లు అందజేస్తుందని వివరించారు. భారతీయ తె లుగు దృక్ గణిత సమాఖ్య సేవా సంఘం కూడా విద్యత్ సభలకు సహకరిస్తోందని తెలిపారు.

బాలాజీస్వామికి దండిగా ఆదాయం

బాలాజీస్వామికి దండిగా ఆదాయం