
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో వెలసిన స్వయంభూ శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సుమారు 25 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా దేవస్థానానికి రూ.3,73,904 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.
లోవ భక్తులకు
సత్యదేవుని ప్రసాదాలు
అన్నవరం: ఆషాఢ మాసం మూడో ఆదివారం తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి లోవ వెళ్లి వచ్చే భక్తులకు సత్యదేవున్ని గోధుమ నూక ప్రసాదం సిద్ధమవుతోంది. వారికి విక్రయించేందుకు లక్షకు పైగా సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఆదివారం కొండ దిగువన, జాతీయ రహదారిపై ఉన్న నమూనా ఆలయాల వద్ద లోవ భక్తులు సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సుమారు 60 వేలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదివారం అంతకన్నా ఎక్కువగా కొనుగోలు చేస్తారనే అంచనాతో అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం సుమారు 60 వేలలు, లోవ భక్తుల కోసం సుమారు లక్ష ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయాల ద్వారా ఆదివారం సుమారు రూ.30 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.