
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: వేలాదిగా భక్తులు తరలిరావడంతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో రద్దీ ఏర్పడింది. రెండో శనివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి ఆలయ ప్రాంగణం చుట్టూ బారులు తీరారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. వందలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామి, అమ్మవార్లను అర్చకులు బీరకాయలతో విశేషంగా అలంకరించారు. సుమారు 7 వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించినట్లు ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు.