
కూటమి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం
బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ సభలో నేతల ధ్వజం
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్యీర్యమైందని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు, అక్రమ కేసులు మొదలయ్యాయని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ ఒకే మాటగా అన్నారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా స్థానిక వాసర్ల గార్డెన్స్‌లో ఆదివారం అమలాపురం అసెంబ్లీ నియెజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆ ముగ్గురూ పోలీసుల ఏక పక్ష తీరుపై ప్రసంగించారు. అల్లవరం మండల పార్టీ అధ్యక్షుడు కొనుకు బాపూజీ కుమారుడిపై, అమలాపురానికి చెందిన పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు దంతులూరి రోహిత్ వర్మపై ఇటీవల పోలీసులు అక్రమ కేసులు పెట్టారని అన్నారు. రాబో యేది జగన్ ప్రభుత్వమే. అప్పుడు పోలీసులుగా మీరు ఇబ్బంది పడకతప్పదని హెచ్చరించారు.
సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేతపై నిలదీద్దాం
జిల్లాలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపి వేయడం అంటే ప్రశ్నించే గొంతును నొక్కేయడమేనని వారు అన్నారు. సాక్షి టీవీ ప్రసారాలు పునరుద్దించే దాకా మన పోరాటం సాగాలని స్పష్టం చేశారు. డిష్‌ల్లోకి మారతామని కేబుల్ ఆపరేటర్లకు చెప్పాలని సూచించారు.
అమలాపురం రూరల్ సీఐకి విశ్వరూప్ హెచ్చరిక
అమలాపురం రూరల్ సీఐగా పనిచేస్తున్న డి.ప్రశాంత్‌కుమార్ కూటమి ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని అన్నారు. సీఐ ప్రశాంత్‌కుమార్...గుర్తుంచుకో... వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే, నిన్ను ఆ అయిదేళ్లూ వీఆర్‌లో ఉంచి తీరతామని విశ్వరూప్ హెచ్చరించారు. అల్లవరం పార్టీ అధ్యక్షుడి కుమారుడు రమేష్‌పై అన్యాయంగా కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించావని విశ్వరూప్ అన్నారు.
ఏలేరు ఆయకట్టుకు నీరు విడుదల
ఏలేశ్వరం: ఖరీఫ్ సాగుకు ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆదివారం 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా పెరిగాయి. ఎగువ నుంచి 1,357 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా 77.47 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.68 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. విశాఖకు 150, తిమ్మరాజు చెరువుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
దారులన్నీ తలుపులమ్మ సన్నిధానానికే..
తుని రూరల్: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆషాఢ మాసం మూడో ఆదివారం.. అమ్మవారిని విశేషంగా ఆరు టన్నుల కూరగాయలతో శాకంబరిగా అలంకరించడంతో భక్తులు తండోపతండాలుగా లోవ దేవస్థానానికి తరలివచ్చారు. తీవ్రమైన రద్దీతో 16వ నంబరు జాతీయ రహదారి నుంచి లోవ ఆర్చి గేటు వరకూ పలుమార్లు ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రం ఆరు గంటలకు కూడా భక్తులు ప్రత్యేక వాహనాల్లో రావడంతో తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. పోలీసులు ఎన్ని ఏర్పాట్లు చేసినా మందుబాబుల ఆగడాలు.. వాహనాలు నిలిపివేయడంతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోవడంతో కొంతమంది భక్తులు బాలాలయంలోనే అమ్మవారిని దర్శించి, కనిపించిన ప్రతి చెట్టుకూ ఉపారాలు సమర్పించారు. లక్ష మంది వరకూ భక్తులు రాగా క్యూలైన్ల ద్వారా ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మవారిని 50 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.5,51,700, పూజా టికెట్లకు రూ.6,92,720, కేశఖండన శాలకు రూ.62,500, వాహన పూజలకు రూ.3,340, వసతి గదుల అద్దెలు రూ.1,09,892, విరాళాలు రూ.2,83,244 కలిపి మొత్తం రూ.17,03,396 ఆదాయం లభించిందని వివరించారు. భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు, ఎస్సై కృష్ణమాచారి ఆధ్వర్యాన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.