
ముంచెత్తుతున్న వరద
వరద పెరిగితే మరింత ముప్పు
ఈ వరదే ఆదివారం ఉదయానికి కాస్త పెరిగితే ఆయా మండలాల్లోని లంక గ్రామాలను ముంచెత్తే అవకాశం ఉంది. వరద మొదటి ప్రమాద హెచ్చరిక అనివార్యమైతే కోనసీమలోని ప్రధానంగా 21 లంక గ్రామాలకు ముంపు ముప్పు తప్పదు. పి.గన్నవరం మండలంలో లంక గ్రామాలైన జి.పెదపూడి లంక, అరిగెల వారిపాలెం, బూరుగులంక తదితర గ్రామాలను వరద ముంచెత్తే అవకాశం ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక పి.గన్నవరం మండలం చాకలిపాలేనికి సమీపంలోనే ఉంటుంది. కనకాయపేటలోని కాజ్‌వే కిందకు వరద నీరు ఉధృతంగా చేరుతోంది. పి.గన్నవరం మండలంలో తాత్కాలిక గట్టు కొట్టుకుపోవడంతో ఇప్పటికే నాలుగు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అమలాపుం టౌన్: జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు వరద ముప్పుపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని లంక గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలను వరద చుట్టుముడుతోంది. ఇక జిల్లాలోని గౌతమి, వైనతేయ, వశిష్ట నదీ పాయలు ఎర్ర నీటితో పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే పి.గన్నవరం మండలం జి.పెదపూడి లంకకు వెళ్లేందుకు నిర్మించిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో లంక వాసుల్లో ఆందోళన మొదలైంది. అలాగే అయినవిల్లి మండలం ముక్తేశ్వరం వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన ముక్తేశ్వరం–కోటిపల్లి తాత్కాలిక రహదారిలో వరద అవస్థలు మొదలయ్యాయి.
పడవ ప్రయాణాలపై అప్రమత్తంగా
అంతకంతకు పెరుగుతున్న వరదతో పడవ ప్రయాణాలకు దాదాపు తెరపడింది. అయితే పలు లంక గ్రామాల ప్రజల రాకపోకలకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన పడవల్లో అత్యంత జగ్రత్తలతో చర్యలు తీసుకున్నారు. వదర వల్ల కె.గంగవరం మండలం కోటిపల్లి వద్ద గోదావరిలో పంటు ప్రయాణాలు నిలచిపోయాయి. పోలవరం, భద్రాచలం వద్ద పెరుగుతున్న వరదతో జిల్లాలోని లంక గ్రామాలపైన, నదీ పాయలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఆదివారం నాటికి కోనసీమలోని అప్పనపల్లి, ముక్తేశ్వరం, చాకలిపాలెం వద్ద గల కనకాయలంక కాజ్‌వేలు ముంపున పడే ప్రమాదం ఉంది. ఈ కాజ్‌వేలు ఉన్న ప్రాంతాల్లో పడవలపైనే ప్రజలు రాకపోకలు సాగించాల్సివస్తోంది.
కోటిపల్లి–ముక్తేశ్వరం రేవులో తాత్కాలిక గట్టు కొట్టుకుపోవడం, పంటు ప్రయాణాలు నిలిపివేయడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగవకు మిగులు జలాలు పెద్ద ఎత్తున విడుదల చేస్తుండడంతో కోనసీమ జిల్లాకు క్రమేపీ వరద పెరుగుతోంది. జిల్లాలో పి.గన్నవరం, అయినవిల్లి, కె.గంగవరం, కపిలేశ్వరపురం, మామిడికుదురు, ముమ్మిడివరం,ఐ.పోలవరం మండల్లాలోని తొలుత పల్లపు ప్రాంతాలకు వరద నీరు చేరుతోంది.
తొగరపాయ వంతెనను
తాకితే కాజ్‌వే మునకే
అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలోని పాత తొగరపాయ వంతెనను వరద నీరు తాకుతోంది. ఈ పాత వంతెన మునిగితే సమీపంలోని కాజ్‌వే కూడా మునిగిపోతోందని ఆ మండలంలోని లంక వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ముక్తేశ్వరం–కోటిపల్లి మధ్య గౌతమీ నదీ పాయపై నిత్యం వేలాదిమంది ప్రయాణికులను రేవు దాటించే పంటు ప్రయాణాలకు బ్రేకులు పడ్డాయి. కె.గంగవరం మండలం కోటపల్లి వద్ద గౌతమి నది వరద నీటితో క్రమేపీ ఉగ్రరూపం దాల్చుతోంది. ఆదివారం ఉదయానికి వరద పెరిగితే కోటిపల్లిలోని మత్స్యకార కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే సఖినేటిపల్లి–పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మధ్య వశిష్ట నదీపాయపై సాగుతున్న పంటు ప్రయాణాలు, అలాగే రాజోలు మండలం సోంపల్లి–అబ్బిరాజుపాలెం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాలను కలిపే జి.మూలపొలం– పల్లంకుర్రు గ్రామాల మధ్య రేవు ప్రయాణాలు నిలిచిపోయే అవకాశం ఉంది.
లంక గ్రామాల ప్రజల ఆందోళన
పల్లపు ప్రాంతాలకు ముంపు ముప్పు
ఎర్రనీటితో పొంగుతున్న నదీపాయలు

ముంచెత్తుతున్న వరద