
ధరను తరిగిన అరటి!
● రెండు నెలల్లో సగానికి పడిపోయిన రేటు
● దిగుబడి పెరగడమే కారణం
● మే నెలలో రూ.500 పలికిన కర్పూర రకం గెల, నేడు రూ.250
● శ్రావణమాసం కోసం రైతులు,
వ్యాపారుల ఎదురుచూపులు
రావులపాలెం: మే నెలలో రైతుకు లాభాలు తెచ్చిన అరటి, రెండు నెలలు గడిచే సరికి నేడు నష్టాలను తెచ్చిపెడుతోంది. మే, జూన్ నెలల్లో ఈదురుగాలుల ప్రభావం లేకుండా ప్రకృతి అనుకూలించడంతో అరటి చెట్లు పడిపోకుండా ప్రతీ ఏడాది కంటే రైతుకు ఎక్కువ దిగుబడిని అందిస్తున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు, రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణ, కడప, వినుకొండ, పార్వతీపురం, సాలూరు ఇలా అరటి పండే అన్ని ప్రాంతాల్లో దిగుబడి పెరిగింది. రాష్ట్రంతోపాటు తెలంగాణ, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు, రాష్ట్రాల్లో అరటి అందిరావడంతో దిగుబడి గణనీయంగా పెరిగింది. దిగుబడి పెరగడంతో ధర పతనమై, అరటి రైతు నష్టాలను చూడాల్సి వస్తోంది. మే నెలలో రూ.500 అమ్మిన కర్పూర రకం అరటిగెల ప్రస్తుతం రూ.250 పలుకుతోంది. రెండు నెలల్లో ప్రారంభం కంటే ప్రస్తుతం దిగుబడి పెరిగింది.
మే నెలలో వ్యాపారులు 10 టన్నుల లారీ సరుకు రూ.1.60 లక్షలకు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం 10 టన్నుల లారీని రూ. 90 వేల నుంచి రూ.1లక్షకు ఖరీదు చేస్తున్నారు. రావులపాలెం అరటి మార్కెట్ యార్డు పరిధిలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, మండపేట, పి.గన్నవరం, సిద్ధాంతం మండలాలతోపాటు, ఖండవల్లి, పెరవలి, పెనుగొండ తదితర ప్రాంతాల్లో సుమారు 12 వేల హెక్టార్లలో అరటి సాగు అవుతుంది. వీటిలో ప్రధానంగా ఆరు రకాల అరటి సాగు జరుగుతుంది. సుమారు 70 శాతం కర్పూర రకం అరటి సాగు ఉంటుంది. 20 శాతం చక్కెరకేళీ రకం (తెలుపు, ఎరుపు) మిగిలిన 10 శాతం బొంత, బుషావళి, అమృతపాణి రకాలు ఉంటాయి. సీజన్‌లో అంటే మార్చి నుంచి జూన్, జూలై నెలల వరకూ సగటున రోజుకు 25 వేల నుంచి 30 వేల అరటి గెలలను రైతులు రావులపాలెం అరటి మార్కెట్ యార్డుకు తీసుకువస్తుంటారు. దీంతో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వ్యాపారం జరుగుతుంది.
కర్పూర రకం అరటి గెలలు
పొలాల వద్దే అమ్మకం
ధర లేకపోవడంతో రైతులు మార్కెట్‌కు గెలలు తీసుకురాకుండా పొలాల వద్దకు వస్తున్న వ్యాపారుల(కొనుగోలుదారుల)కు విక్రయిస్తున్నారు. దీంతో సగం సరకు మార్కెట్‌కు రాకుండా నేరుగా పొలాల నుంచి ఎగుమతి అవుతుంది. మార్కెట్‌కు తరలించేందుకు రైతుకు గెలకు కూలి అదనంగా రూ.50 ఖర్చు అవుతుండడం, అరటి ధర లేకపోవడంతో రైతులు పొలాల వద్దే వ్యాపారులకు విక్రయాలు చేస్తున్నారు. సహజంగా సీజన్‌లో రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి ఒడిశా, బిహార్, జార్ఘండ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు, రాష్ట్రంలో వైజాగ్, పార్వతీపురం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, చిత్తూరు తదితర ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రస్తుతం తమిళనాడు, ఒడిశౠ, తెలంగాణ రాష్ట్రాలకు, రాష్ట్రంలో విశాఖ, సాలూరు, పార్వతీపురం, గుంటూరు, తదితర ప్రాంతాలకు ఎగుమతులు అవుతున్నాయి.
అయితే ఒడిశాలో ఒక ప్రాంతంలో కలరా వ్యాధి రావడంతో అక్కడ అరటి, మామిడి వినియోగం తగ్గిందని, అధిక వర్షాలు, లారీల సమ్మె కారణంగా రావులపాలెం మార్కెట్ నుంచి ఒడిశాకు పెద్దగా ఎగుమతులు జరగడం లేదని వ్యాపారులు అంటున్నారు. పూరీ జగన్నాథస్వామి రథోత్సవం జూన్ 27 తేదీన జరిగింది. అక్కడ స్థానికులు రథోత్సవం అనంతరం 15 రోజులు ఎటువంటి పూజలు చేయరని దీంతో అరటి వినియోగం తగ్గిందని అంటున్నారు. ఒడిశాలో ఇలా ఉంటే ఇతర రాష్ట్రాల్లో స్థానికంగా సరకు ఉండటంతో ఇక్కడ అరటి వెళ్లడం లేదని, వెళ్లినా ధర ఉండటం లేదని వ్యాపారులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలలో అరటి ధరల్లో వ్యత్యాసాలు
అరటి రకం మే నెల ప్రారంభంలో ధరలు ప్రస్తుత ధరలు
కనిష్ట గరిష్ట కనిష్ట గరిష్ట
కర్పూర 200 600 100 300
చక్కెర కేళీ (తెలుపు) 300 700 200 500
బుషావళి 150 400 100 250
బొంత(కూరఅరటి) 150 400 100 300
అమృతపాణి 250 700 200 450
చక్కెర కేళీ(ఎరుపు) 300 800 200 600
శ్రావణమాసం కోసం ఎదురుచూపులు
అరటి రైతులు, వ్యాపారులు మరో 15 రోజుల్లో వచ్చే శ్రావణమాసం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అరటి ధర లేకపోవడం, దిగుబడి అన్ని ప్రాంతాల్లో ఉండటంతో శ్రావణమాసం వస్తే పూజలు జరుగుతాయని, మన రాష్ట్రంతో పాటు ఒడి శాలో కూడా వినియోగం పెరుగుతుందని రైతులు, వ్యాపారులు శ్రావణం కోసం ఆశగా చూస్తున్నారు.
– కోనాల చంద్రశేఖరరెడ్డి, అరటి వ్యాపారి, ఊబలంక
అరటి రైతుకు నష్టం వస్తుంది
ప్రసుత్తం అరటికి ధర పలకడం లేదు. మార్కెట్‌కు గెలలు తీసుకురావడానికి సైకిల్‌కు రూ.300 కూలి ఇవ్వాల్సి వస్తుంది. కనీసం ఆ డబ్బు మిగులుతుందని పొలాల వద్దకు వస్తున్న వ్యాపారులకు వచ్చిన రేటుకే రైతులు గెలలు అమ్ముతున్నారు. ప్రారంభంలో వచ్చిన లాభాన్ని, పెట్టుబడిని కూడా ప్రస్తుత నష్టం అధిగమిస్తుండటంతో అరటి రైతులకు ఈ ఏడాది కలిసిరాలేదు.
– కె.పెద్దిరెడ్డి, కౌలు రైతు, ఊబలంక
రెండు నెలల్లో సగానికి ధర పడిపోయింది
ఏప్రిల్, మే నెలలో ప్రారంభంలో ఉన్న ధర, ప్రస్తుతం లేదు, కర్పూర రకం సగానికి పడిపోయింది. దీంతో రైతులకు ఊహించని నష్టాలు చవి చూడాల్సి వస్తోంది. మార్కెట్ ఇలానే ఉంటే రైతుకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది.
ద్వారంపూడి నారాయణరెడ్డి,
రైతు,
రావులపాలెం.
దిగుబడి ఉన్నా, రేటు లేదు
ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది దిగుబడి బాగుంది. అయితే ప్రారంభంలో ఉన్న రేటు ఇప్పుడు లేదు. దీంతో చేల వద్దకు వస్తున్న వ్యాపారులకు వచ్చిన రేటుకు గెలలు విక్రయిస్తున్నాం. మార్కెట్ కి తీసుకువస్తే అదనంగా ఖర్చవుతుంది తప్ప ఉపకారం లేదు. ఈ పరిస్థితి మారితేనే రైతుకి కొంత ఊరట లభిస్తుంది. శ్రావణమాసమైన ధర బాగుండాలని కోరుకుంటున్నాం.
బి పెద్దిరాజు, రైతు, ర్యాలీ
.

ధరను తరిగిన అరటి!

ధరను తరిగిన అరటి!

ధరను తరిగిన అరటి!

ధరను తరిగిన అరటి!

ధరను తరిగిన అరటి!