
పరిపాలనపై పట్టు ఉండాలి
● ఈటీసీ ప్రిన్సిపాల్ ప్రసాదరావు
● ఉమ్మడి జిల్లా మహిళా ఎంపీపీ,
జెడ్పీటీసీల శిక్షణ
సామర్లకోట: అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావడం ద్వారా పరిపాలనా నైపుణ్యం ప్రదర్శించడానికి మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇస్తున్నట్టు విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు అన్నారు. ఉమ్మడి జిల్లాలోని మహిళా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులకు మూడు రోజుల శిక్షణలో భాగంగా రెండో రోజు మంగళవారం గ్రూప్ డిస్కషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్పు ద్వారా విజేతలు, మహిళా సాధికారితతో స్వపరిపాలన సాధ్యం అనే అంశంపై శిక్షణ ఉంటుందని చెప్పారు. పదవీ కాలం పూర్తి అవుతున్న తరుణంలో ఇస్తున్న శిక్షణ జీవిత కాలంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం చేస్తున్న పదవులలో మంచి సమర్ధతను చూపించడం ద్వారా మరింత ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణతో సమర్ధతను పెంచుకోవడం ద్వారా మంచి పదవులు లభించే అవకాశం ఉంటుందన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండటంతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాయకత్వం ఏ ఓక్కరికో పరిమితం కాకూడదన్నారు. మహిళలు తమ సమర్ధతను పూర్తి స్థాయిలో ప్రదర్శించడం లేదనే ఆరోపణ ఉన్నాయన్నారు. దీనిలో భాగంగా మహిళ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయనే కేంద్ర ప్రభుత్వం భావిస్తొందని తెలిపారు. దీని కోసమే శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రజల ముందు ఏ విధంగా మాట్లాడాలి, ఇతరుల నుంచి విషయాలు తెలుసుకోవడం, పంచాయతీ చట్టాలు, పరిపాలనపై అవగాహన ఉండాలన్నారు. స్వయంగా తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. సమర్ధ నాయకత్వానికి చదువుతో సంబంధం లేదన్నారు. ఈ శిక్షణలో వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, కోర్సు డైరెక్టర్ కె.సుశీల, ఫ్యాకల్టీలు పి.శర్మ, డి.శ్రీనివాసరావు, ఎం.చక్రపాణిరావు, కేఆర్ నిహారిక, పి.రామకృష్ణ శిక్షణ ఇచ్చారు.