
వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలకు టెండర్లు
● కలెక్టర్ మహేష్ కుమార్
● పర్యాటక పరమైన ఆదాయ
సముపార్జనపై అధికారులతో సమీక్ష
అమలాపురం రూరల్: దిండి, ఆత్రేయపురం, అంతర్వేది బీచ్ అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఆరు పాయింట్లు గుర్తించి టెండర్లు పిలిచినట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో పర్యాటక రంగ అభివృద్ధి అధికారులు ఆరు బోటింగ్ పాయింట్లకు సంబంధించి ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించి ఇటీవల సమర్పించిన సమగ్ర ప్రతిపాదనలపై సమీక్షించారు. వశిష్ట గోదావరి బంగాళాఖాతంలో కలిసే నదీముఖ ద్వారం వద్ద బోటింగ్ స్పోర్ట్స్ నిర్వహించి పర్యాటకంగా ఆదాయ సముపార్జించవచ్చుని కలెక్టర్ పేర్కొన్నారు. గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి నదుల శాఖలు కాటన్ బ్యారేజీ వద్ద ఉద్భవించి కోనసీమ జిల్లా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందన్నారు. కాటన్ బ్యారేజీ భాగంలోని బొబ్బర్లంక హెడ్ లాక్‌ల నుంచి ప్రారంభమై ప్రధాన కాలువ బొబ్బర్లంక నుంచి ఆత్రేయపురం మండలంలోని లొల్ల వరకు దాదాపు 13 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుందన్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన పురాతన నిర్మాణం, అలాగే వాడపల్లి వేంకటేశ్వర ఆలయం యాత్రికులు సందర్శిస్తుంటారని, స్థానిక ఆధ్యాత్మిక భావన పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తుందనీ పర్యాటకులు స్పీడ్ బోట్లు, ఫుడ్ కోర్టులు, బోటింగ్ స్పోర్ట్స్ అనువుగా తీర్చిదిద్దాలన్నారు. జేసీ టి.నిశాంతి, పర్యాటక శాఖ ఆర్డీ పవన్‌కుమార్, బోటింగ్ అధికారి గంగబాబు, జిల్లా పర్యాటక అధికారి అన్వర్, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రతి ఎకరాకు సాగు నీరు
ఆయకట్టులో స్థిరీకరించిన ప్రతి ఎకరాకు సకాలంలో సాగునీరు అందించే దిశగా జల వనరులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పూర్తి భాగస్వామ్యం వహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం రెవెన్యూ, వ్యవసాయ జలవనరుల శాఖ అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సాగునీటి సరఫరా స్థితిగతులపై సమీక్షించారు. చివరి ఆయకట్టుకు సాగునీరు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో తగిన పరిష్కార మార్గాలు సూచించాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీలలో పూడికతీత పనులపై ప్రత్యేక దృష్టి సారించి క్లీనింగ్‌కు చర్యలు చేపట్టాలని డ్రైనేజీ ఇంజినీర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ నిశాంతి, జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు, జల వనరుల డ్రైనేజీ ఇంజినీర్లు పాల్గొన్నారు.
పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పీ–4
పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే పీ–4 లక్ష్యమని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్థిక గణాంకశాఖ అధికారులు డీఆర్డీఏ, డ్వామా, జీఎస్‌డబ్ల్యూఎస్ సిబ్బంది, విజన్ డాక్యుమెంట్ యూనిట్ సిబ్బందితో పీ–4 పథకం అమలుపై రాష్ట్ర ప్రణాళిక శాఖ సంప్రదింపుదారులు అవగాహన సమావేశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పేదవారిని ఆర్థిక సామాజిక రంగాల్లో తీసుకువచ్చేలా ఈ పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 64 వేల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని వీరిని మార్గదర్శకులకు దత్తత ఇచ్చేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీవో మురళీకృష్ణ ఎల్‌డీఎం కేశవ వర్మ, డ్వామా పీడీ మధుసూదనరావు, డీఆర్‌డీఏ పీడీ గాంధీ, జిల్లా ఉద్యాన అధికారి బీవీ రమణ పాల్గొన్నారు.