
పంటకాలువలో పడి కౌలురైతు మృతి
కాజులూరు: మండలంలోని ఒంటితాడిలో పంటకాలువలో పడి తాళ్లరేవు మండలం కోరంగి శివారు బొడ్డువానిలంకకు చెందిన కౌలు రైతు నరాల నాగరాజు (38) మంగళవారం మృతిచెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు బొడ్డువానిలంకకు చెందిన నాగరాజు కాజులూరు మండలం ఒంటితాడి పంచాయతీ పరిధిలో ఒక రైతుకు చెందిన రెండు ఎకరాల భూమి సాగు చేస్తున్నాడు. మంగళవారం చేనుకు గడ్డి మందు పిచికారీ చేసేందుకు పొలానికి వచ్చాడు. పొలం పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలు సాయంత్రం తిరిగి వస్తుండగా పంట కాలువలో నాగరాజు మృతి చెంది ఉండడాన్ని గమనించారు. వెంటనే హుటాహుటిన గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదుచేయగా పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగరాజు పొలానికి వచ్చే సమయంలోనే తీవ్ర నీరసంగా ఉన్నాడని దాంతో పొలం పనులు చేస్తూ ప్రమాదవశాత్తు పంట చేలో పడి మృతి చెంది ఉంటాడని రైతులు అభిప్రాయపడుతున్నారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.