
నాయకత్వ టీచింగ్
● 12 సామర్‌ాధ్యల్లో నైపుణ్యాభివృద్ధికి హెచ్‌ఎంలకు శిక్షణ
● బ్యాచ్‌కు 250 మంది వంతున
రెసిడెన్షియల్ మోడ్‌లో ట్రైనింగ్
● నేడు చెయ్యేరు శ్రీనివాసా ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభం
రాయవరం: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు పలు కార్యక్రమాలను విద్యాశాఖ, సమగ్ర శిక్షా సంయుక్తంగా చేపడుతున్నాయి. ఉపాధ్యాయుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు వృత్యంతర శిక్షణనిస్తోంది. 21వ శతాబ్దపు నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్సఫర్మేషన్ (సాల్ట్)లో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ప్రధనోపాధ్యాయుల్లో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసేందుకు నాలుగు రోజుల శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రచించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ శిక్షణ రెసిడెన్షియల్/నాన్ రెసిడెన్షియల్ విధానంలో కొనసాగనుంది.
12 నాయకత్వ నైపుణ్యాలు
2026 నాటికి పాఠశాల ప్రధానోపాధ్యాయుల్లో నాయకత్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ కృషి చేస్తోంది. స్వీయ అవగాహన, స్వీయ నిర్వహణ, పాఠ్యాంశాల బోధన నిర్వహణ, అభ్యాస సంస్కృతిని ప్రోత్సహించడం, పరిశీలన, అభిప్రాయం, డేటా ఆధారిత దిశలు, పాఠశాల వనరుల నిర్వహణ, ఆర్థిక వనరుల నిర్వహణ, కమ్యూనికేషన్ ప్రభావం, సంఘర్షణ నిర్వహణ, సహకారాన్ని నిర్మించడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. పాఠశాల భద్రత, వాతావరణ మార్పు అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు. పాఠశాలల్లోని అవసరాలు, విశ్లేషణ ఆధారంగా సామర్థ్యాలను రెండు లెర్నింగ్ సైకిల్స్‌లో నేర్పిస్తారు. విపత్తు సమయాల్లో నిర్వహణ, పాఠశాల భద్రత అంశాల్లో ప్రధానంగా శిక్షణ ఉంటుంది.
సీమాట్ పర్యవేక్షణలో..
స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (సీమాట్) పర్యవేక్షణలో ప్రధానోపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామ పరిధిలోని శ్రీనివాసా ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాకు చెందిన ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. బ్యాచ్‌కు 250 వంతున మోడల్ ప్రైమరీ స్కూల్స్ హెచ్‌ఎంలు, గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందిన వారికి, ప్రాథమిక పాఠశాలల ఎస్‌జీటీ ప్రధానోపాధ్యాయులకు శిక్షణ వస్తారు. ఏలూరు జిల్లా అగిరిపల్లిలో ఈ ఏడాది మే నెలలో శిక్షణ పొందిన 10 మంది మాస్టర్ ట్రైనీలు ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.
ప్రీ, పోస్ట్ టెస్ట్‌లు
ట్రైనింగ్‌లో భాగంగా రెసిడెన్షియల్ విధానంలో ఉన్న ప్రధానోపాధ్యాయులకు ఉదయం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారికి అవసరమైన శిక్షణతో పాటు, మానసికోల్లాసానికి అవసరమైన ఆటలు, పాటలు, యోగా, ధ్యానం తదితర అంశాల్లో కూడా ప్రవేశం కల్పిస్తారు. ట్రైనింగ్‌కు ముందు ప్రీ టెస్ట్, ట్రైనింగ్ అనంతరం పోస్ట్ టెస్ట్‌ను ప్రధానోపాధ్యాయులకు నిర్వహించి, వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. వివిధ పద్ధతుల ద్వారా నిరంతర సమగ్ర మూల్యాంకనం చేసి, వారిలో నాయకత్వ పెంపుదల సూచీని అభివృద్ధి చేస్తారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా పర్యవేక్షణలో, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగనుంది.
● సద్వినియోగం చేసుకోవాలి
పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడే నాయకుడు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకమైనది. సాల్ట్ ప్రాజెక్టులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు రోజుల రెసిడెన్షియల్ ట్రైనింగ్‌ను సమగ్ర శిక్ష తరఫున నిర్వహిస్తున్నారు.
– డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
● ఏర్పాట్లు పూర్తి
లీడర్ షిప్ ట్రైనింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశాం. పాల్గొనేవారికి అవసరమైన మౌ లిక సదుపాయాలను కల్పించాం. మూడు విడతలుగా నిర్వహిస్తున్న ఈ శిక్షణకు తొలి విడతలో 250 మంది ప్రధానోపాధ్యాయులు హాజరవుతున్నారు. ప్రధానోపాధ్యాయులు శిక్షణ పొందడం ద్వారా నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవచ్చు.
– జి.మమ్మీ, ఏపీసీ, సమగ్ర శిక్షా,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

నాయకత్వ టీచింగ్

నాయకత్వ టీచింగ్