
గోదావరి పరవళ్లు
● కడలిలోకి 5.29 లక్షల క్యూసెక్కులు
● ఎగువన తగ్గుతున్న వరద ఉధృతి
ధవళేశ్వరం: గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటితో నది ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 10.60 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 5,29,209 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి ఆదివారం మరింత పెరిగే అవకాశం ఉంది. కాటన్ బ్యారేజీ వద్దకు సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నది ఉధృతి క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద శనివారం 41.10 అడుగులకు చేరిన నీటిమట్టం క్రమేపీ 40.90 అడుగులకు తగ్గింది. దీంతో, ఆదివారం సాయంత్రం నుంచి ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో)
కాళేశ్వరం 8.77
పేరూరు 13.87
దుమ్ముగూడెం 11.50
కూనవరం 16.14
కుంట 7.30
పోలవరం 10.78
రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 14.94
రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద గోదావరి ఉధృతి

గోదావరి పరవళ్లు