
సారె.. అచ్చెరువొందేలా!
అమలాపురం రూరల్: శ్రీనివాస అన్నదాన మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో పద్మావతి, అలివేలు అమ్మవార్లకు పసుపు, కుంకుమ, గాజులు, మిఠాయిలు చీర, సారె సమర్పించారు. ఆలయ అర్చకుడు బీరక భీమ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత సంప్రదాయ బద్ధంగా ముత్తైదువులు సారెను కోలాటంతో ఊరేగింపుగా ఆలయ సన్నిధికి తీసుకువచ్చారు.
గర్భస్థ లింగ నిర్ధారణ
పరీక్షలు నేరం
అమలాపురం రూరల్: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, అటువంటి పరీక్షలు చేసిన, చేయించుకున్నవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం లింగ నిర్ధారణ నిషేధత చట్టం – 1994 అమలుపై జిల్లా స్థాయి మల్టీమెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ సలహాకమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ శిశువును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్థారణ చేసే స్కానింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ఎం.దుర్గారావు దొర, అదనపు డీఎంహెచ్‌ఓ భరత లక్ష్మి, అదనపు జిల్లా ఎస్పీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవం : జనాభా పెరుగుదలపై అవగాహన పెంచడానికి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రచార బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఆరోగ్యం, విద్య అందరికీ సమా న అవకాశాలను కలిగించే సమ్మిళిత విధానాలను ఈ సందర్భంగా సమగ్రంగా చర్చించాలన్నారు.