
తీరంపై జలఖడ్గం
● కోతకు గురవుతున్న విలువైన భూములు
● దివిసీమ ఉప్పెన నుంచీ ఆటుపోట్లు
● ముందుకు చొచ్చుకు వస్తున్న సముద్రం
● వందలాది ఎకరాలు ఇప్పటికే కనుమరుగు
● రక్షణ చర్యల్లో అధికారులు విఫలం
మలికిపురం: సముద్ర తీరప్రాంత భూముల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఇక్కడ సముద్ర అలల ఉధృతి అధికంగా ఉండడం వల్ల విలువైన పేదల భూములు, పేదలకు పట్టాలుగా ఇచ్చిన భూములు కోతకు గురై కనుమరుగవుతున్నాయి. మామిడికుదురు మండల కరవాక గ్రామం నుంచీ మలికిపురం మండలం గొల్లపాలెం, తూర్పుపాలెం, కేశనపల్లి, పడమటిపాలెం, శంకరగుప్తం, చింతలమోరి, సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం, అంతర్వేది కర, అంతర్వేది దేవస్థానం, పల్లిపాలెం గ్రామాల సముద్ర తీర భూములు ఇలా కోతకు గురవుతున్నాయి. ఇక ప్రధానంగా సముద్రంలో వెళ్లే ఓడల రాక పోకలు మార్గ నిర్దేశకంగా అంతర్వేది పల్లిపాలెం వద్ద ఉన్న లైట్‌హౌస్‌కు కూడా సముద్ర అలల వల్ల ముప్పు పొంచి ఉంది. ఇక్కడ సముద్రం నానాటికీ ముందుకు చొచ్చుకువస్తోంది. 1980 దశకంలో దివి సీమ ఉప్పెన సమయంలో లైట్‌హౌస్‌కు సమీపంలోని పల్లిపాలెం కూడా సముద్రంలో మునిగిపోయింది. ఆ సమయంలో ప్రమాదం ముందే ఊహించిన ప్రజలు సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం పల్లిపాలెం కొత్తగా ఏర్పడ్డది. అప్పటి లైట్‌హౌస్ కొట్టుకుపోవడంలో నౌకాదళం కొత్తగా లైట్‌హౌస్ నిర్మించింది. ఉప్పెన తరువాత 2010 వరకూ ఇక్కడ భూభాగం విస్తరించింది. మొత్తం బయటపడక పోయినా కొట్టుకుపోయిన పాత లైట్‌హౌస్ బయటపడి వందలాది ఎకరాలు మేటలు వేసింది. అప్పట్లో భూములు పోగొ ట్టుకున్న యజమానులతో పాటు ఆక్రమణదారులు కూడా ఈ భూములను సాగు చేసుకున్నారు. అయితే 2010 నుంచి పూర్వపు స్థితి పునరావృతం అవుతోంది. 2010 నాటికి లైట్‌హౌస్‌కు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రం ప్రస్తుతం లైట్‌హౌస్‌ను తాకుతోంది. 2006 సునామి సమయంలో కూడా సముద్రం ఇంత ఉధృతంగా లేదు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఒక్క అంతర్వేది కర నుంచి పల్లిపాలెం వరకూ మాత్రమే ఈ పరిస్థితి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపు తిప్ప నుంచి పేరుపాలెం వరకూ ఈ పరిస్థితి కొనసాగుతోంది.
సముద్రంలో మేటలు కూడా
అంతర్వేది పల్లిపాలెం సాగర సంగమ ప్రాంతం. నాసిక్‌లో పుట్టిన గోదావరి అఖండ గోదావరిగా మారి ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తోంది. డెల్టా ప్రాంతం కావడంతో అనాదిగా ఇక్కడ గోదావరి ప్రవాహంలో మట్టి వచ్చి సముద్రపు మేటల వేయడం వల్ల క్రమేపీ భూభాగం పెరుగుతూ వచ్చింది. తాజాగా ఈ భూములు పెరగడం అటుంచి ఉన్న భూమి కోతకు గురవుతోంది. పదేళ్ల క్రితం వరకూ సాగర సంగమం సమీపంలో సముద్రం మధ్యలో వేసిన భారీ ఇసుక మేటలు కూడా ప్రస్తుతం కనుమరుగయ్యాయి.
పేదలు నష్టపోతున్నారు
సముద్ర తీర గ్రామాలలో అలల కోత అధికంగా ఉంటుంది. దానివల్ల విలువైన భూములు కోతకు గురై సముద్రంలో కలసిపోతున్నాయి. ఎస్సీ సొసైటీలకు ప్రభుత్వ పరంగా సంక్రమించిన ఈ భూములలో సాగవుతున్న సరుగుడు తోటలు కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
– కొంబత్తుల చంద్రశేఖర్, సొసైటీ మాజీ అధ్యక్షులు, శంకరగుప్తం
రక్షణ చర్యలు తీసుకోవాలి
తీర ప్రాంత సొసైటీ, జిరాయితీ భూములలో సరుగుడు తప్ప వేరే సాగు ఉండదు. ఇలా వచ్చే కొద్దిపాటి సంపాదనే ఇక్కడి పేదల జీవనాధారం. దీనిపై రక్షణ చర్యలుతీసుకుని కోతను అరికట్టాలని ఏళ్ల తరబడి కోరుతున్నాం. గతంలో అధికారులు పరిశీలించినా చర్యలు మాత్రం తీసుకోలేదు. – తాడి నీలకంఠం, అంతర్వేది
ఇక వలస పోవాల్పిందే
సముద్ర ఉధృతికి తీరం కోత, ఉప్పునీరు ముంచెత్తడం వంటి సమస్యలతో విలువైన భూములను రైతులు కోల్పోతున్నారు. కొబ్బరి, సరుగుడు తోటలు నాశనం అయ్యాయి. ప్రభుత్వం శ్రద్ద పెట్టక పోతే ఈ గ్రామాల రైతులు వలసపోవాల్సిందే.
– యెనుముల నాగు, సర్పంచ్, కేశనపల్లి
వందల ఎకరాలు సముద్రం పాలు
ఇప్పటికే సముద్ర తీరం వెంబడి వందలాది ఎకరాల్లో సరుగుడు, కొబ్బరి తోటలు కెరటాల ఉధృతికి సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అనేక మంది రైతులు విలువైన భూములను నష్టపోయారు. ఉన్న భూములనైనా కాపాడాలని స్థానిక ప్రజలు అధికారులను ముక్త కంఠంతో కోరినా స్పందన లేదు.
లైట్‌హౌస్‌కు ముప్పే
దివిసీమ ఉప్పెన ప్రభావంతో లైట్‌హౌస్‌తో పాటు, పల్లిపాలెం గ్రామం జలమయమైంది. అప్పట్లో ఇక్క డ ఉన్న మత్యకారులు కొందరు జలసమాధి కాగా కొందరు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటపడ్డా రు. అప్పటి లైట్‌హౌస్ కొట్టుకుపోవడంతో కొత్త లైట్ హౌస్ నిర్మించారు. తాజాగా అలల ఉధృతికి దానికి కూడా ముప్పు పొంచిఉందని స్థానికులు చెప్తున్నారు.

తీరంపై జలఖడ్గం

తీరంపై జలఖడ్గం

తీరంపై జలఖడ్గం

తీరంపై జలఖడ్గం

తీరంపై జలఖడ్గం