
గోదారి జలజడి
సాక్షి, అమలాపురం: గోదారి ఎరుపెక్కింది.. పరవళ్లు తొక్కుతూ ముందుకు వస్తోంది.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు వేగంగా పరుగులు తీస్తోంది. ఎగువన క్యాచ్‌మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద పోటు తగిలింది. కాటన్ బ్యారేజీకి నీరు వచ్చి చేరుతోంది. రెండు, మూడు రోజుల నుంచి వరద నీరు పెరగడం, తగ్గడం జరుగుతోంది. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు మాత్రం వరదల సీజన్ వచ్చింది.
గోదావరికి వరద పోటు తగలడంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు బుధవారం సాయంత్రం 2,30,624 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. వాస్తవంగా ఆదివారం 2,11,837 క్యూసెక్కులకు పెరిగి తరువాత తగ్గింది. తిరిగి పెరుగుతోంది. గోదావరికి ఈ ఏడాది వరదల సీజన్ ముందుగానే మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడితే ముందు ముందు వరద పెరిగే అవకాశముంది. ఈ నెల నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ వరదల సీజన్. తరువాత క్రమేపీ తగ్గుముఖం పడుతోంది.
జలదిగ్బంధమే..
గోదావరి వరద ఉధృతిని బట్టి జిల్లాలో ముంపు తీవ్రత అధికంగా ఉంటోంది. 18 మండలాల్లో 103 గ్రామాలు వరదల బారిన పడతాయి. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల్లోని లంక గ్రామాలకు తీవ్రత అధికంగా ఉంటుంది. ఇక్కడ పలు లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. పలు గ్రామాలకు పడవల మీదనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కొద్దిపాటి వరదకే పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక, బూరుగులంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేటపై తొలి ప్రభావం ఉంటోంది. తరువాత ఇదే మండల పరిధిలో జొన్నలంక, మానేపల్లి శివాయలంక, పల్లెపాలెం, కె.గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీ, తాళ్లరేవు మండలం పిల్లంక పంచాయతీ కొత్తలంక, ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠానేల్లంక, గురజాపులంక, అల్లవరం మండలం బోడసుకుర్రు మత్స్యకార కాలనీలో వరద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వరద పెరిగే కొద్దీ మిగిలిన ప్రాంతాల్లోనూ ముంపు అధికమవుతోంది.
ఏటిగట్లు.. నిర్వహణకు తూట్లు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో గోదావరి, గౌతమీ, వశిష్ట, వైనతేయ, కోరంగి నదులు సుమారు 260.80 కిలో మీటర్లు కాగా, వీటికి రక్షణగా నిర్మించిన ఏటిగట్టు పొడవు 535 కిలోమీటర్లు. ఇందులో కాటన్ బ్యారేజీ ఎగువన అఖండ గోదావరి కుడి, ఎడమ ఏటిగట్ల పొడవు 83.73 కిలోమీటర్లు. కాగా గౌతమీ కుడి, ఎడమ ఏటిగట్టు, కోరింగ ప్రాజెక్టు ఫ్లడ్ బ్యాంకులు కలిపి 204.70 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. వశిష్ట, వైనతేయ కుడి, ఎడమ ఏటిగట్టు పొడవు 246.30 కిలోమీటర్లు. గౌతమీ ఎడమ ఏటిగట్టు పరిధిలో కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి, కె.గంగవరం మండలం సుందరపల్లి, కూళ్ల శివారు ఎస్సీ పేట, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక వద్ద ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయి. గౌతమీ కుడి ఏటిగట్టు పరిధిలో కొత్తపేట మండలం బోడిపాలెం వంతెన వద్ద గట్టు ఆధునీకరణ జరగలేదు. భారీ వరద వస్తే ప్రమాదకరమే. వృద్ధ గౌతమీ కుడి గట్టు పరిధిలో కాట్రేనికోన మండలం కుండలేశ్వరం పుష్కరాల రేవు వద్ద గట్టు అత్యంత బలహీనంగా ఉంది. వైనతేయ కుడి ఏటిగట్టు పరిధిలో పి.గన్నవరం మండలం డొక్కా సీతమ్మ అక్విడెక్టు నుంచి నాగుల్లంక వరకూ ఏటిగట్టు లేదు. మానేపల్లి, నాగుల్లంక, మామిడికుదురు మండలం పాశర్లపూడి, పాశర్లపూడిబాడవ, పెదపట్నం వద్ద బలహీనంగా ఉన్నాయి. వశిష్ట ఎడమ ఏటిగట్టు పరిధిలో రాజోలు మండలం తాటిపాక మఠం వద్ద కొంత, రాజోలు సోంపల్లి, రాజోలు ఆంజనేయస్వామి ఆలయం నుంచి శివకోడు వరకు ఏటిగట్టు ఎత్తు, పటిష్ట పనులు చేయలేదు. మలికిపురం మండలం దిండి, రామరాజులంకలతోపాటు పెద్ద వంతెన వద్ద నుంచి సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లిలంక వరకు గట్టు బలహీనంగా ఉంది. పి.గన్నవరం ఎల్.గన్నవరం, మొండెపులంక లాకుల వద్ద ఇదే పరిస్థితి.
లంక వాసుల్లో గుబులు
కానరాని అధికారుల ముందస్తు చర్యలు
నామమాత్రంగా సమీక్షలు
పలుచోట్ల ఏటిగట్లు బలహీనం
శిథిలావస్థలో ఫ్లడ్ స్టోరేజ్‌లు
ఫ్లడ్ ‘స్టోరేజ్’ అంతంత మాత్రమే..
ఏటిగట్ల రక్షణ కోసం ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే అధికంగా ఫ్లడ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఫ్లడ్ స్టోరేజ్‌లు ఆరు కాగా, 15 పర్మినెంట్ ఫ్లడ్ స్టోరేజ్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా వరదల సమయంలో 14 అడిషనల్ ఫ్లడ్ స్టోరేజ్‌లను ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలో అన్ని రకాల ఫ్లడ్ స్టోరేజ్‌లు ఏడు ఉండగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 26, కాకినాడ జిల్లాలో మూడు చొప్పున ఉన్నాయి. వరద విపత్తులను తట్టుకునేందుకు, గట్లు గండ్లు పడకుండా ఇక్కడ సామగ్రి ఉంచేవారు. ఇటీవల కాలంలో ఫ్లడ్ స్టోరేజ్ ఆలనాపాలనను నీటిపారుదల శాఖ అధికారులు గాలికి వదిలేశారు. ఈ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో సామగ్రి ఉంచడం లేదు. జిల్లా యంత్రాంగం సైతం ఏటిగట్ల వద్ద వరదల సమయంలో తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టడం, కలెక్టరేట్ కేంద్రంగా ఒకటి రెండు సార్లు సమీక్షలు నిర్వహించడం తప్ప శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. దీనివల్ల వరదల సమయంలో అటు లంక వాసులు మాత్రమే కాకుండా డెల్టా వాసులు కూడా భయం భయంగా కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.

గోదారి జలజడి

గోదారి జలజడి