
సమన్వయంతో ముందుకు సాగాలి
వివిధ శాఖల
అధికారులతో
సమీక్షిస్తున్న జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఏఎస్పీ ప్రసాద్
అమలాపురం టౌన్: నేర పరిశోధన, రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలు, బాధితులకు సత్వర న్యాయం వంటి ప్రధాన విషయాల్లో పోలీసులు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేసినప్పుడే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో స్థానిక ఎస్పీ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలిపారు. వాటిపై ఇతర శాఖల అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని సమీక్షించారు. ముఖ్యంగా సరిహద్దు తగదాలపై రెవెన్యూ అధికారులు, రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా రవాణా శాఖ అధికారులతో, బాలికలు, మహిళల భద్రతా విషయాలపై సోషల్ వెల్ఫేర్ శాఖతో ఎస్పీ చర్చించారు. విద్యాలయాల్లో మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేక కమిటీల నియామకంపై అధికారులతో సమీక్షించారు. జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌బీపీ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, రవాణా శాఖ అధికారి డి.శ్రీనివాస్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎన్.పార్ధసారథి, డీఈఓ డాక్టర్ షేక్ సలీమ్ బాషా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.దుర్గారావు దొర, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్‌కేడీవీ ప్రసాద్, జిల్లా సోషల్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫీసర్ పి.జ్యోతిలక్ష్మి, జిల్లా హైవే అథారిటీస్ ఏఈ ఎన్.వెంకటరమణ పాల్గొన్నారు.