
సహకార సీఈఓల ధర్నా
మలికిపురం: కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు ధర్నా చేశారు. ఈ మేరకు బుధవారం మలికిపురం డీసీసీబీ వద్ద నిరసనకు దిగారు. మలికిపురం బ్యాంక్ పరిధిలో 10 సహకార సంఘాల సీఈఓలు, సిబ్బంది పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఈఓలు రామలింగేశ్వరరావు, ఆకుల బోగేశ్వరరావు, రంగరాజు, రామరాజు, జగదీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మొక్కలు
నాటేందుకు సన్నాహాలు
రాయవరం: ‘అమ్మ పేరిట ఒక మొక్క’ అనే కార్యక్రమాన్ని గురువారం పాఠశాలల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి.మమ్మీ తెలిపారు. రాష్ట్ర సమగ్ర శిక్షా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలల్లో మెగా పేటీఎం 2.0 పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు మొక్కలు నాటడంతోపాటు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయిస్తామన్నారు. పాఠశాలల్లో తగినంత స్థలం లేని పక్షంలో ఇంటి వద్ద లేదా రహదారుల పక్కన మొక్కలు నాటి వాటి సంరక్షణను నాటిన వారే చేపట్టే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్లపాటు మొక్కలు సంరక్షించే బాధ్యతలను పక్కాగా చేపట్టేందుకు గ్రీన్ పాస్‌పోర్టును విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉందన్నారు.